ఏపీలో కూటమిలో డిప్యూటీ సీఎం పదవి పై రచ్చ మొదలైంది. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ ముఖ్య నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీని పైన పవన్ మద్దతు దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కు మాత్రమే ఆ హోదా ఉంటుందని చెప్పి.. ఇప్పుడు లోకేష్ గురించి ప్రతిపాదన చేయటం పైన జనసైనికులు మండి పడుతున్నారు. ఇదే అంశం పైన సోషల్ మీడియా వేదికగా పవన్ – లోకేష్ మద్దతు దారుల మధ్య వార్ ముదురుతోంది. ఇదే సమయంలో ఏపీలో తాజా పరిణామాల పైన బీజేపీ నాయకత్వం తమ వైఖరి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
డిప్యూటీ సీఎంగా లోకేష్
జనసేనాని పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే, హోం మంత్రి పైన వ్యాఖ్యలు.. తిరుపతి తొక్కిసలాట ఘటనలో పవన్ స్పందించిన తీరుతో కొత్త రాజకీయం మొదలైంది. పవన్ చేస్తున్న వ్యాఖ్యలతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతోందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో మొద లైంది. దీంతో, నేరుగా పవన్ ను టార్గెట్ చేయకుండా.. పవన్ తో పాటుగా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనే డిమాండ్ వ్యూహాత్మకంగా తెర మీదకు తీసుకొచ్చారు. అయితే, పవన్ హోదా తగ్గకుండా మరెవరికీ డిప్యూటీ సీఎం హోదా ఇవ్వకూడదని గతంలోనే నిర్ణయించారు. తెలంగాణ, కర్ణాటకలోనూ భట్టి, డీకే శివకుమార్ విషయంలోనూ ఇదే ఫార్ములా అమలు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వార్
కాగా, కొద్ది రోజులుగా టీడీపీ నేతలు వరుసగా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ వరుస డిమాండ్లు చేస్తున్నారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో పవన్ టీటీడీ బోర్డు, అధికారులు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేసారు. దీని పైన లోకేష్ స్పందించిన తీరు సైతం చర్చగా మారింది. పవన్ డిమాండ్ తో టీడీపీకి సంబంధం లేదని లోకేష్ వ్యాఖ్యానించారు. ఇక, తాజాగా చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేసారు. దీని పైన చంద్రబాబు స్పందించ లేదు. దీనికి మద్దతుగా వరుసగా టీడీపీ ముఖ్య నేతలు తెర పైకి వచ్చారు. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నారు.
ఢిల్లీ నేతల ఆరా
డిప్యూటీ సీఎం పదవి పవన్ తో పాటుగా లోకేష్ కు ప్రతిపాదించటం పైన జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఏ విధంగా కూటమి అధికారంలోకి రావటానికి కారణమయ్యారో వివరిస్తూ పోస్టింగ్స్ పెడుతున్నారు. దీంతో, సోషల్ మీడియా వేదికగా టీడీపీ – జనసేన మద్దతు దారుల మధ్య వార్ కొనసాగుతోంది. ఇదే సమయంలో ఈ వివాదం పైన బీజేపీ అధినాయకత్వం ఆరా తీసినట్లు సమాచారం. పదవుల విషయంలో చర్చలతో పరిష్కరించుకోవాలని..కూటమి సఖ్యత పై ప్రభావం పడేలా ఉండకూడదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ వివాదం పై చంద్రబాబు, పవన్ స్పందించ లేదు. దీంతో..ఈ రచ్చ రానున్న రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.