ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ కు ఏపీ సర్కార్ భారీ షాకిచ్చింది. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.
సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై వచ్చిన అభియోగాలపై సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ ఆదేశాలిచ్చారు. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి సునీల్ కుమార్ పై త్రిబుల్ ఆర్ ఫిర్యాదు చేశారు.
అలాగే నిబంధనలకు విరుద్ధంగా పలు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని రఘురామ కృష్ణరాజు ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు అథారిటీని వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. సీఐడీ చీఫ్ గా పలు కేసులలో కీలక పాత్ర పోషించారు. కాగా రఘురామ కృష్ణరాజు అరెస్ట్ సమయంలో సునీల్ కుమార్ పేరు మార్మోగింది. తనను కస్టోడియల్ టార్చర్ చేసిన వారిలో సునీల్ కుమార్ ఉన్నారన్నది రఘురామ కృష్ణరాజు ప్రధాన ఆరోపణ.
ఆ సమయం నుండే కేంద్రానికి కూడ త్రిబుల్ ఆర్ ఫిర్యాదులు చేశారు. ప్రస్తుతం సునీల్ కుమార్ పై నమోదైన ప్రతి అభియోగం వాస్తవమా కాదా అనేది తేల్చేందుకు ప్రభుత్వం అథారిటీని నియమించింది. మరి ఈ నివేదికలో వచ్చే వివరణను బట్టి చర్యలు తీసుకుంటారా లేదా అన్నది తేలుతుందని చెప్పవచ్చు.