ఈరోజుల్లో ఒక సినిమా థియేటర్లలో విడుదల అవ్వడం ఆలస్యం. మార్నింగ్ షో అయిపోగానే మ్యాట్నీ లోపు ఆ సినిమా పలు పైరసీ వెబ్‌సైట్స్‌లో వచ్చేస్తోంది. వెంటనే ఆ పైరసీ వెబ్‌సైట్స్‌ను గుర్తించి సినిమాను అందులో నుండి తొలగించడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు చాలావరకు సక్సెస్ అవుతున్నాయి. కానీ ముందుగానే ఒక సినిమా పైరసీ సైట్స్‌లోకి రాకుండా మాత్రం వారు ఆపలేకపోతున్నారు. తాజాగా రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమా పైరసీ వెనుక ఎవరు ఉన్నారనే విషయం మొత్తానికి బయటపడింది. పోలీసులు వారిని అదుపులోకి కూడా తీసుకున్నారు.
అదుపులోకి నిందితులు
మామూలుగా చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా పైరసీ అనేది కామన్‌గా జరుగుతూనే ఉంటుంది. కానీ ‘గేమ్ ఛేంజర్’ విషయంలో అది శృతిమించింది. ఈ సినిమా పైరసీ ప్రింట్ ఏకంగా లోకల్ టీవీ ఛానెల్స్‌లో, బస్సులో సైతం ప్రసారం అవ్వడం మొదలయ్యింది. దీంతో మేకర్స్‌తలో పాటు పోలీసులు సైతం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఏపీలోని ఏ ప్రాంతంలో, ఏ ఛానెల్‌లో ఈ మూవీ పైరసీ ప్రింట్‌ను ప్రసారం చేశారో.. వారిని వెతికి పట్టుకున్నారు పోలీసులు. ఏపీ లోకల్ టీవీ యజమాని అయిన అప్పల రాజును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకున్నారు.
తనిఖీలు మొదలు
ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఆన్‌లైన్ పైరసీ సైట్స్‌లో లీక్ అయ్యిందని మేకర్స్ కంప్లైంట్ ఇవ్వగా.. 45 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవైపు ఈ మూవీ పైరసీపై ఇంత జరుగుతుండగానే ఏపీ లోకల్ టీవీ.. ఈ సినిమాను నేరుగా ప్రసారం చేసే ధైర్యం చేసింది. దీంతో వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమయ్యారు. కాపీరైట్ సేఫ్టీ సిస్టమ్స్ మ్యానేజింగ్ డైరెక్టర్ అయిన హెవీ చలపతి రాజు.. గాజువాక పోలీసులు, క్రైమ్ క్లూల్స్ టీమ్‌తో కలిసి తనిఖీలు మొదలుపెట్టారు. అలా ఏపీ లోకల్ టీవీపై జరిపిన రైడ్‌లో అప్పల రాజు ఈ కేసులో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. వారి దగ్గర ఉన్న పరికరాలను సీజ్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అప్పలరాజుతో పాటు ఈ కేసులో మరికొందరు నిందితులు అరెస్ట్ అయ్యారని తెలుస్తోంది.
నెగిటివ్ రివ్యూలు
ఇప్పటికే రామ్ చరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాను నెగిటివ్ చేయడం కోసం కొందరు నెటిజన్లు కావాలనే దీనిపై నెగిటివ్ రివ్యూలు వైరల్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే చాలావరకు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘గేమ్ ఛేంజర్’పై నెగిటివ్ రివ్యూలే కనిపిస్తున్నాయి. మూవీని మరింత నెగిటివ్ చేయడం కోసం ఈ సినిమాలో బాలేని కొన్ని సీన్స్‌ను ఆన్‌లైన్‌లో కూడా లీక్ చేశారు. ఇది కాపీరైట్స్‌కు భంగం కలిగిస్తుంది కాబట్టి మైకర్స్ దీనిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు దీనిపై చాలా సీరియస్‌గా ఉన్నారు.