తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు రెండు పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. తాజాగా కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఎమ్మెల్యేల మధ్య వావాదం
అది కాస్త ముదిరి ఇరువురు పరస్పరం తోసుకోవడంతో ఒకసారిగా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతుండగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసలు మీరు ఏ పార్టీనో చెప్పాలని ఆయనతో వాగ్వాదానికి దిగారు.
తోపులాటతో ఉద్రిక్తత
ఇక మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు సమక్షంలోనే ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగడంతో పాటు తోపులాటకు పాల్పడడంతో ఒక్కసారిగా అక్కడివారు ఉలిక్కిపడ్డారు. ఒకరిపై ఒకరు పరస్పరం చేయి చేసుకోవడంతో పోలీసులు కౌశిక్ రెడ్డిని బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. దీంతో కొద్దిసేపు అక్కడ గందరగోళం చోటు చేసుకుంది.
నిధుల గురించి అడిగితే దౌర్జన్యం చేస్తున్నారన్న పాడి కౌశిక్ రెడ్డి
ఇక బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి నిధుల వివరాలు అడిగితే తమ పైన దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో 50% మాత్రమే రుణమాఫీ జరిగిందని, మిగిలిన రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉందని తక్షణం రైతులకు ఇవ్వవలసిన రుణమాఫీ డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇబ్బందులు పెట్టినా పోరాటం ఆగదు
గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 18500 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చామని పాడి కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. తక్షణమే దళిత బంధు రెండో విడత నిధులు కూడా మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ నేతల బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరెన్ని ఇబ్బందులు సృష్టించిన తాము రైతుల పక్షాన నిలబడతామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తేల్చి చెప్పారు.