ప్రపంచంలోనే అతిపెద్ద జనసమూహంగా రికార్డులు సృష్టించే మహా కుంభమేళకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 న ముగిసే ఈ కార్యక్రమంలో దాదాపు 45 కోట్ల మంది హిందువులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని అంచనా. ఇలాంటి కార్యక్రమంలో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా పకడ్భందీగా భద్రతా చర్యలు చేపడుతున్నారు.. ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు. ఇందుకోసం.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల్ని వినియోగించనున్నారు. మరి.. యూపీ పోలీసులు వాడుతున్న సాంకేతికతలు ఏంటో తెలుసా…
రోజూ కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాల కోసం నదికి వస్తుంటారు. వారి భద్రత, సరైన మార్గనిర్దేశం సహా వివిధ ఏర్పాట్లకు దాదాపు 30 వేల మంది పోలీసులు అవసరం అవుతారని భావిస్తున్నారు. ఇందుకోసం.. ఉత్తర్ ప్రదేశ్ లోని 70 జిల్లాల నుంచి పోలీసు బలగాల్ని రప్పిస్తున్నారు. వీరంతా.. నిత్యం భక్తుల రాకపోకలు, వారి కదలికల్ని నిశితంగా పరిశీలించనున్నారు. కాగా.. వీరికి అదనంగా అత్యంత శక్తివంతమైన సాంకేతికతల సాయం తీసుకునేందుకు యూపీ పోలీసులు రంగం సిద్ధం చేశారు.
పవర్ ఫుల్ కెమెరాలు సిద్ధం..
కోట్ల మంది ప్రజల కదలికల్ని పరిశీలించేందుకు దాదాపు 2,700 వందలకు పైగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కెమెరాలను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా.. భక్తుల రాకపోకలు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు.. రద్దీ క్రమబద్ధీకరణ సహా మిగతా భద్రతను పరిశీలించేందుకు ఇవి పనిచేయనున్నాయి.
ఈ కెమెరాలతో పాటు అండర్ వాటర్ డ్రోన్లను వినియోగించనున్నారు. త్రివేణి సంగమం దగ్గర నదీ స్నానానికి వచ్చే భక్తుల రియల్ టైమ్ సర్వైలెన్స్ ను పరిశీలించనున్నారు.
త్రివేణీ సంగమంతో పాటు చుట్టుపక్కల గుడుల్లో మాత్రమే కాకుండా… ప్రయాగ్ రాజ్ కు దారి తీసే అన్ని మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు యూపీ పోలీసులు తెలిపారు. సంగమం దగ్గరకు వచ్చే వాహనాలకు అప్పటికప్పుడు తనిఖీలు చేయడం వీలు కాని నేపథ్యంలో.. వాహనాల్ని ముందుగానే క్షుణ్ణంగా తనిఖీలు చేయనున్నారు. ప్రయాగ్ రాజ్ కి దారితీసే ఎనిమిది జిల్లాల్లోని రహదారులపై చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి అన్ని వాహనాల్ని భద్రతా తనిఖీలు నిర్వహించనున్నారు.
ప్రస్తుతం.. ఏడంచెల విధానంలో కుంభమేళ కోసం భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు… వాహన తనిఖీల కోసం ఇప్పటికే.. 102 చెక్ పాయింట్లను ఏర్పాటు చేసి 1,026 మంది సిబ్బందిని కూడా కేటాయించారు. భారీ భద్రతా ఏర్పాటు చేయాల్సి రావడంతో.. రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ ఫోర్స్ సాయం తీసుకుంటున్నారు.
అలాగే.. భక్తుల కోసం 125 అంబులెన్సులను వినియోగించనున్న ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం.. ఏడు రివర్ అంబులెన్స్ లను సైతం అందుబాటులో ఉంచనుంది. వీటి ద్వారా.. ఎవరైన భక్తులు అస్వస్థతకు గురైతే చికిత్స అందించనున్నారు. కుంభమేళ జరిగినన్ని రోజులు రాష్ట్ర సర్కార్ చాలా జాగ్రత్తగా వ్యవహరించనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జాతీయ సంస్థలు సైతం ఈ కార్యక్రమాన్ని సజావుగా నెరవేర్చేందుకు వివిధ ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రపంచంలోనే అద్భుతమైన సమ్మేళనాన్ని విజయవంతంగా గట్టెక్కించాలని కృషి చేస్తున్నాయి.