UPDATES  

NEWS

 కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..?

తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతున్నాయా? ఎన్నికలు గడిచి ఏడాది అయినా కేసీఆర్ ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్న కేటీఆర్‌కు కొత్త చిక్కు వచ్చినట్టు తెలుస్తోంది. ఇకపై పార్టీ వ్యవహారాలు కవిత చేతుల్లోకి వెళ్లనున్నాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అసలేం జరుగుతోంది ఇంకా లోతుల్లోకి వెళ్తే..

 

తెలంగాణలో అధికారం పోయి బీఆర్ఎస్‌ ఏడాది గడిచింది. కాకపోతే తొలి ఏడాది ఆ పార్టీకి ఎలాంటి చిక్కులు రాలేదు. అసలు సమస్యలు రెండు లేదా మూడో ఏడాదిలో ఉంటాయని అంటున్నారు కొందరు నేతలు. ఎందుకుంటే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతోంది.

 

మిగతా కేసు విషయం కాసేపు పక్కనబెడితే, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అడ్డంగా ఇరుక్కున్నారన్నది అధికార పార్టీ నేతల మాట. లేటెస్ట్‌గా కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.

 

ప్రభుత్వం పంపిన దస్త్రానికి రెండు రోజుల కిందట గవర్నర్ ఆమోద ముద్ర వేశారట. దీంతో కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు మార్గం సుగమమైంది. కేటీఆర్‌తోపాటు అప్పటి పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఇందులో ఇరుక్కునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయట.

 

అసలేం కేసు వ్యవహారం ఏంటి? బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. దీనికి సంబంధించి నిధుల అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి గానీ, ఆర్బీఐ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఓ విదేశీ కంపెనీకి అప్పటి ప్రభుత్వం నిధులు చెల్లించింది.

 

దాదాపు 46 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించింది అప్పటి మున్సిపల్ శాఖ. అయితే చెల్లింపుల్లో ఇటు హెచ్ఎండీఏ బోర్డు నుంచి అనుమతి పొందలేదు. అలాగే అప్పటికే కేసీఆర్ కేబినెట్ లో ప్రస్తావించలేదు. ఒక విదేశీ సంస్థకు నిధులు ఇవ్వాలంటే ఆర్బీఐ నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

 

ఆ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చేసింది అప్పటి కేసీఆర్ సర్కార్. కొత్తగా వచ్చిన రేవంత్ సర్కార్‌ దీనిపై ఫోకస్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అక్టోబరులో ఏసీబీ.. ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగిపోయింది. గవర్నర్‌ను రేవంత్ సర్కార్ సంప్రదించడం జరిగిపోయింది. లేటెస్ట్‌గా గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు అంతర్గత సమాచారం. రేపో మాపో ఆ కేసు స్పీడ్ అందుకోనుంది. మొత్తానికి రాబోయే రోజుల్లో కేటీఆర్‌కు ఇబ్బందులు తప్పవన్నమాట.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |