తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక సర్వే మొదలైంది. శనివారం నుంచి మొదలైన ఈ సర్వే, డిసెంబర్ 31 వరకు జరగనుంది. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించిన జిల్లా కలెక్టర్లు అందుకు సంబంధించి మార్గ దర్శకాలను జారీ చేశారు.
రోజుకు కనీసం 20 దరఖాస్తులను సర్వే చేయాలన్నది ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా ప్రతీ 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్ ఉండనున్నారు. పట్టణాల్లో వార్డు అధికారి, బిల్ కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్ ఉంటారు. అదే గ్రామాల్లో అయితే గ్రామ కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బంది వివరాలు సేకరించనున్నారు.
ఒకరోజు ముందుగానే సర్వే గురించి గ్రామాలు, వార్డులకు సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించి పత్రాలను రెడీ చేయాలని ఇప్పటికే తెలిపారు. ఇక కలెక్టర్లు, హౌసింగ్ శాఖ పీడీలు దిగువస్థాయికి వెళ్లి యాప్‌లో వివరాల నమోదు తీరును గమనిస్తున్నారు.
ఇళ్లు కేటాయింపులో తొలుత వికలాంగులకు, అనాథలు, ఒంటరి మహిళలు, వితంతువులు, ట్రాన్స్ జెండర్లు, సఫాయి కార్మికులు, ఆదివాసీలకు ప్రయార్టీ ఇవ్వనుంది ప్రభుత్వం. ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇక దరఖాస్తుదారుడు ఉన్న సొంత ఇల్లు లేదా అద్దె ఇంటి ఫోటోలు తీసి అందులో యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.
దీనికితోడు వారికున్న స్థలాల వివరాలు సేకరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అసలైన లబ్దిదారులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం ఆలోచన. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తున్నట్లు గత ప్రభుత్వం ప్రకటించింది. కేవలం కార్యకర్తలకు మాత్రమే వచ్చాయి. ఈసారి అలా కాకుండా అసలైన లబ్ధిదారులను న్యాయం జరిగేలా చేస్తోంది కాంగ్రెస్ సర్కార్.
ఏడాదికి నాలుగున్నర లక్షల మంది ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఓవరాల్‌గా పరిశీలిస్తే రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీ ఇచ్చిన హామీ నెరవేరుతుందని అధికార పార్టీ భావిస్తోంది.