UPDATES  

NEWS

 ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏఐ టెక్నాలజీ తరగతులు..

ఏపీలోని స్కూల్స్, కళాశాలల విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుండి విద్యార్థులకు ఏఐ ఆధారిత సేవలపై శిక్షణ తరగతులను కూడా నిర్వహించేందుకు గూగుల్ తో కీలక ఒప్పందం జరిగింది. దీనితో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంపై మరింత అవగాహన పెంచాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష.

 

ఏంటా ఒప్పందం?

ఎఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఏపీ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం గురువారం జరిగింది. రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్టిజి శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఎపి రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ నడుమ సచివాలయంలో అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా ఎఐ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పాఠశాలలు, కళాశాలల్లో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అలాగే స్టార్టప్ లు, సాంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఎఐ ఆధారిత సేవల కోసం శిక్షణ కార్యక్రమాలను సైతం చేపట్టనుంది.

 

ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ సుస్థిరత వంటి కీలకమైన అంశాల్లో ఎఐ&ఎంఎల్ సొల్యూషన్స్ ను ఏకీకృతం చేయడానికి గూగుల్ సంస్థ ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తుంది. ఏఐ ఆధారిత వ్యవస్థలో ఆర్థిక వృద్ధి చెందడానికి అవసరమైన శిక్షణ, వనరులను యువతకు అందించడం ద్వారా నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి గూగుల్ సంస్థ సహకారాన్ని అందిస్తుంది. అంతేకాదు ఎఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు గూగుల్ సంస్థ సహకారాన్ని అందిస్తుంది. ఎంఓయు సందర్భంగా అమరావతి సెక్రటేరియట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఈడిబి సిఇఓ సాయికాంత్ వర్మ, ఆర్టీజిఎస్ సీఈఓ దినేష్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఎపి ప్రభుత్వ ఇన్వెస్టిమెంట్స్ విభాగం ఉన్నతాధికారి యువరాజ్ పాల్గొన్నారు.

 

విద్యార్థులకు కలిగే ప్రయోజనం ఇదే..

పాఠశాల, కళాశాలల విద్యార్థులకు ఏఐ ఆధారిత శిక్షణ తరగతులు నిర్వహించడం ద్వారా వారి సందేహాలు క్షణాల వ్యవధిలో నివృతి అవుతాయి. అలాగే నూతన టెక్నాలజీపై అవగాహన కలిగి ఉండడం ద్వారా, భవిష్యత్ లో విద్యార్థులు టెక్నాలజీ విద్యపై ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రాబోయే తరంలో ఏఐ ఆధారిత సేవలు విస్తృతం కానుండగా, విద్యార్థి దశలో ఏఐ అంటే ఏమిటి? ప్రయోజనాలు ఏమిటో తెలుసుకొనే వీలు కూడా విద్యార్థులకు కలుగుతుంది. మొత్తం మీద సీఎం చంద్రబాబు నాయుడు తన విజన్ లో భాగంగా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత చేరువ చేసేందుకు గూగుల్ తో కీలక ఒప్పందం చేయడం శుభపరిణామంగా చెప్పవచ్చు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |