ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనలపై దాఖలైన పలు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ప్రభుత్వం నిర్దేశించిన రీతిలో పోషకాలతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు వడ్డించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలకు సంబంధించిన నివేదికను సమర్పించాలని కోరింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను 6 వారాలపాటు వాయిదా వేసింది.
రెండు కమిటీలు ఏర్పాటు చేశాం: ఏఏజీ
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధె, జస్టిస్ జె.శ్రీనివాస్రావులతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టుకు పలు వివరాలు అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనలపై పరిశీలన కోసం రెండు కమిటీలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తరపున ఏఏజీ న్యాయస్థానానికి తెలిపారు. బాధ్యులను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. 25,941 ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు వెల్లడించారు. వారిలో 75 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురైనట్లు వివరించారు.
నాణ్యమైన భోజనాన్ని అందించేందుకుగానూ ఏజెన్సీలకు చెల్లించే డబ్బులను 40 శాతం మేర ప్రభుత్వం పెంచిందని తెలియజేశారు. ‘పీఎం పోషణ్ పథకం’లో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు ఉండాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. కమిటీల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, కమిటీలు సరిగా పనిచేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. మధ్యలో కలగజేసుకున్న ఏఏజీ అన్ని కమిటీలు పనిచేస్తున్నాయని కోర్టుకు తెలిపారు. కరీంనగర్, నారాయణపేట్ జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో రెండు వేర్వేరు కమిటీలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. భోజనం వికటించిన ఘటనపై ఈ కమిటీలు అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. ఏఏజీ చెప్పిన వివరాలను హైకోర్టు నమోదు చేసుకుంది.
ఇటీవల నారాయణపేట జిల్లాలోని మాగనూరు జెడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల 20 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన మాగనూరు, మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. గత కొద్ది రోజులుగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్టోబర్ 30న కూడా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురిని హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్‌లో చేర్చారు. వారిలో ఇద్దరు విద్యార్థులు కోలుకోగా.. శైలజా (16) అనే విద్యార్థిని నవంబరు 25న మృతి చెందింది.
పురపాలికల్లో పంచాయతీల విలీనానికి లైన్ క్లియర్
పురపాలికల్లో గ్రామ పంచాయతీలను విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో విలీనానికి మార్గం సుగుమం అయింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారమే విలీన ప్రక్రియ జరిగిందని హైకోర్టు పేర్కొంది. పాలనలో భాగంగా చట్టాలను తీసుకొచ్చే అధికారం అసెంబ్లీకి ఉందని స్పష్టం చేసింది. కాగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 51 గ్రామ పంచాయతీలను పురపాలికల్లో విలీనం చేశారు. అయితే దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ చేపట్టి సీజే ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది.