ఏపీలో అప్పులు ఎంతవరకు ఉన్నాయి? బడ్జెట్‌లో ఏ విషయాలు ప్రభుత్వం బయటపెట్టింది? ఆర్థిక స్థితిపై కాగ్ తేల్చిన నిజాలేంటి? భారమంతా కూటమి సర్కార్‌పై పడిందా? అవుననే అంటున్నాయి కాగ్ లెక్కలు.
ప్రభుత్వాలు ఖర్చు చేసే ప్రతీ రూపాయి బయటపెడుతుంది కాగ్. ప్రభుత్వాలు చెప్పే లెక్కల కన్నా, కాగ్‌నే అందరూ ప్రమాణికంగా తీసుకుంటారు. ఎవరేమనుకున్నా కాగ్ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. వైసీపీ రూలింగ్‌లోని చివరి ఏడాది లెక్కల చిట్టాను బయటపెట్టింది కాగ్.
సింపుల్‌గా చెప్పాలంటే ప్రభుత్వానికి వచ్చే ప్రతీ రూపాయిలో 19 పైసలు అప్పు తీర్చేందుకు వెళ్తుందని తేల్చింది. ఆస్తుల సృష్టికి కేవలం 9 పైసలు మాత్రమే కేటాయించింది. శాసనసభ అనుమతి లేకుండా 634 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు బయటపెట్టింది.
2023-24 ఏడాది ఆర్థిక సంవత్సరం లెక్కల్ని పరిశీలించిన కాగ్, దాదాపు 33 వేల కోట్ల బడ్జెటేతర రుణాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థికశాఖకు తెలియజేసింది. ఇక బడ్జెట్‌లో చూపని రుణాల కోసం అసలు, వడ్డీల రూపంలో 10 వేల కోట్లు పైగానే ఉందన్నది అందులోని సారాంశం.
జీఎస్డీపీలో అప్పుల వాటా 34 శాతంగా పేర్కొంది. 2023-24 ఆర్థిక ఏడాదికి రూ.4, 86, 151 కోట్ల రూపాయలున్నట్లు పేర్కొంది. పెండింగ్ బిల్లులు దాదాపు రూ. 1.50 లక్షల కోట్ల మేరా ఉన్నాయి. కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చి అప్పులు సమీకరిస్తోంది. వాటిని బడ్జెట్‌లో చూపలేదట.
కేంద్రం ఇచ్చిన నిధులు 30 రోజల్లోపు చెల్లించలేదు. దీంతో కేంద్రానికి ఏడు శాతం వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అలా 2023-24 ఏడాదికి 283.96 కోట్ల రూపాయలకు వడ్డీ చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని కాగ్ తన లెక్కల్లో ప్రస్తావించింది.
ప్రభుత్వం సరైన సమయంలో నిధులు చెల్లించలేదు. దీంతో వడ్డీ భారం భరించాల్సి వచ్చింది కడిగి పారేసింది కాగ్. ఇదికాకుండా 53 కోట్ల రూపాయలు రెవిన్యూ అవసరాల కోసం ఖర్చు చేసి, ఆ మొత్తాన్ని మూలధన వ్యయం కింద లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. వైసీపీ ఆర్థికభారమంతా ఇప్పుడు కూటమి సర్కార్‌పై పడింది.