UPDATES  

NEWS

 తెలంగాణలో కుల గణనకు తేదీ ఖరారు.. ఎప్పుడంటే..?

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టనున్నారు. తెలంగాణలో నవంబర్ 6 నుంచి కులగణన ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఆ రోజే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఆహ్వానించాలని రేవంత్ ప్రభుత్యం యోచిస్తోంది. ఈమేరకు గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

 

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కులగణన తర్వాత ఏయే సంక్షేమ కార్యక్రమాలకు ఎంత నిధులు కేటాయించాలో తెలిసే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రులు తెలిపారు. త్వరలో అన్ని జిల్లాల్లో కులగణనపై సమావేశాలు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

 

సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వారిని ఆదుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. రాహుల్‌ గాంధీ హామీ మేరకు కులగణన చేస్తున్నామన్నారు. సర్వేతో అందరి సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయన్నారు. భవిష్యత్‌లో దేశమంతా తెలంగాణను అనుసరిస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు.

 

కాగా, కుల గణనలో.. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రాజకీయ పదవులు పొందారా?, ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యారా?, మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా?, ఎలా ఉపాధి పొందుతున్నారు?, భూమి ఉందా?, ఏడాదికి కుటుంబ ఆదాయం ఎంత వస్తుంది? ఈ వివరాలన్నీ సేకరించే అవకాశం ఉంది. ఈ మేరకు ఒక్కో కుటుంబంలోని సభ్యుల సమాచార సేకరణకు మొత్తం 60 ప్రశ్నలను తయారు చేశారు. వీటిలో సగం కుటంబం నేపథ్యంపైనే ఉండగా, మిగిలినవి వ్యక్తిగతవివరాలకు సంబంధించినవి ఉంటాయి.

 

ఈ ప్రశ్నల్లో ఏవి అవసరం అనేది రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉంది. బీసీ కులాల వివరాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది. బీసీ కులాల వారితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరి కులం, ఉపకులం ఏమిటి? స్థానికంగా కులాల పేర్లలో ఏమైనా మార్పులున్నాయ? వంటి వివరాలన్నీ సేకరించనున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |