UPDATES  

NEWS

 అయోధ్య దీపోత్సవం.. 25 లక్షల దీపాలతో గిన్నిస్ రికార్డ్..

అయోధ్యలో బాల రాముడు కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. గత ఎనిమిదేళ్లుగా సరయూ నదీ తీరంలో దీపోత్సవం నిర్వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం.. ఈసారి అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్వయంగా దీపాలు వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు 25 లక్షలకుపైగా దీపాలు వెలిగించారు. దీంతో అయోధ్యా నగరం దీపాల కాంతుల్లో వెలిగిపోయింది.

 

అయోధ్య దిపోత్సవంలో భాగంగా, యూపీ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భక్తులుఏకకాలంలో 25,12,585 దీపాలను వెలిగించారు. ఇది ఇంతకు ముందు ఉన్న అన్ని గిన్నిస్రికార్డులను బ్రేక్ చేసింది. అదే విధంగా యూపీ పర్యాటక శాఖ, సరయు హారతి సమితి ఆధ్వర్యంలో ఏకకాలంలో 1,121 మంది దేవునికి హారతి ఇస్తూ ప్రపంచ రికార్డ్ సృష్టించారు. ఈ విధంగా ఆయోధ్య దీపోత్సవం ఏక కాలంలో రెండు గిన్నిస్ రికార్డులను సృష్టించినట్లయింది.

55 ఘాట్‌లలో ఏర్పాటు చేసిన ఈ ప్రమిదలను ప్రత్యేక డ్రోన్లతో గిన్నిస్‌ ప్రతినిధులు లెక్కించారు.

 

కాగా, 25 లక్షల దీపాలను వెలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్న నిర్వాహకులు, దాదాపు 28 లక్షల ప్రమిదలను ముందస్తుగానే ఆర్డర్‌ చేశారు. అయోధ్య రామమందిరంతోపాటు పరిసర ప్రాంతాలను దీపాలతో అలంకరించారు.

దీపోత్సవ కార్యక్రమంలో 30,000 వాలంటీర్లు పాల్గొన్నారు. ఓ ఘాట్‌ వద్ద 80,000 దీపాలతో స్వస్తిక్‌ ఆకారంలో దీపాలను వెలిగించారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఆవు నెయ్యితో లక్షన్నర దీపాలను వెలిగించారు.

 

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రత్యేక పూజలు చేసి, హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మయన్మార్‌, నేపాల్‌, థాయిలాండ్‌, మలేసియా, కంబోడియా, ఇండోనేసియాకు చెందిన కళాకారులతో వేదిక వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఘాట్‌ల వద్ద దాదాపు 6 వేల మంది అతిథుల కోసం ఏర్పాట్లు చేశారు. లైవ్‌ కవరేజీ కోసం పెద్ద తెరలు ఏర్పాటు చేశారు. అయోధ్య నగరం మొత్తం దాదాపు 10,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

కాగా, అయోధ్య ఆలయంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట తర్వాత తొలి దీపావళి కావడం వల్ల దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అయోధ్య దీపోత్సవానికి ముందు రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి వేషధారులు కొలువుదీరిన రథాన్ని లాగారు. ఇక, ఈ వేడుకల సందర్భంగా ప్రదర్శించిన లేజర్‌, డ్రోన్‌ షోలు, రామాయణ ఘట్టాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. లేజర్‌ షో ద్వారా రామాయణ ఘట్టాలను ప్రదర్శించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |