బీఆర్ఎస్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది ధరణి పోర్టల్. దీని వలన సమస్యలు జఠిలమయ్యాయే తప్ప పరిష్కారం కాని సమస్యలతో ప్రజలు నానా అవస్థల పాలయ్యారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా ధరణి ని రద్దు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పినట్లుగానే ఆ దిశగా చర్యలు చేపట్టింది. రేవంత్ సర్కార్ ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ఎన్ఐసీకి అప్పగించింది. ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ధరణి వ్యవహారాలను చూసుకుంటున్న టెరాసిస్ ప్రైవేటు సంస్థను తప్పించి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ కి రేవంత్ సర్కార్ కీలక బాధ్యతలను అప్పగించింది. మూడు సంవత్సరాల పాటు ధరణి అంశాల నిర్వహించేలా ఎన్ఐసీ తో రాష్ట్ర సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది. ఎలాంటి అవకతవకలు లేకుండా ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే మరో రెండు సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యను ఇదే సంస్థకు అప్పగించాలని చూస్తోంది రేవంత్ సర్కార్.
ఎన్ఐసీకి బాధ్యతలు
ప్రైవేటు సంస్థ నుంచి ఎన్ఐసీకి బాధ్యతలను అప్పగించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయల నిర్వహణ భారం తగ్గుతుందని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతానికి ధరణి పోర్టల్ కు సంబంధించిన టెక్నికల్ అంశాలను పూర్తి స్థాయిలో ఎన్ఐసీకి బదిలీ చేస్తున్నామన్నారు. ఈ నెలాఖరు వరకూ టెరాసిస్ సిబ్బంది ఎన్ఐసీ సిబ్బందికి సహకారం అందించనున్నారు.
అతి తక్కువ వ్యయంతో..
ఈ ఏడాది మొదటి త్రైమాసికంతోనే టెరాసిస్ సంస్థ నిర్వహణ గడువు ముగిసినప్పటికీ తాత్కాలిక నిర్వహణ బాధ్యతలను పొడిగిస్తూ వచ్చింది రెవెన్యూ శాఖ. అయితే రేవంత్ రెడ్డి సీఎం కాగానే ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, టీజీటీఎస్ ఎండితో సహా పలువురు ఐఎఎస్ అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ధరణి పోర్టల్ నిర్వహన బాధ్యతను ఎన్ఐసీ, టీజీటీఎస్, సీజీసీ సంస్థలకు అప్పగించే విషయంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది కమిటీ. రేవంత్ అనుసరించబోయే భూమాత పోర్టల్ నిర్వహణను అతి తక్కువ వ్యయంతో చేపట్టడానికి ఎన్ఐసీ సంస్థ ముందుకు వచ్చింది. దీనితో ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతను ఎన్ఐసీ కే అప్పగించాలని నిర్ణయానికి వచ్చింది రేవంత్ సర్కార్.
ధరణి కాదు భూమాత
ధరణి మూలాలను సామూహికంగా తొలగించి అందులోని లోటుపాట్లను అధ్యయనం చేసి ఇకపై ప్రజలకు అందుబాటులో ఉండేలా భూమాత పోర్టల్ ని సిద్ధం చేసే పని ఊపందుకోనుంది. ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేస్తున్నారు అధికారులు. పదేళ్లుగా రైతులు భూసమస్యలపై పరిష్కారం దొరకక అవస్థల పాలయ్యారని.. ఇకపై వారికి ఎలాంటి లోటూ లేకుండా సమస్యను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించేలా భూమాత పోర్టల్ ను రూపొందించాలని సీఎం ఆదేశించారు. గతంలో ధరణి పోర్టల్ లో ఉత్పన్నమైన సమస్యలను అధిగమించేలా భూమాత పోర్టల్ ని రూపొందించాలనే లక్ష్యంతో ఉన్నారు అధికారులు.
దేశానికే రూల్ మోడల్ గా..
దేశానికే రూల్ మోడల్ గా ఇక భూమాత పోర్టల్ ని తీర్చిదిద్దాలనుకుంటున్నారు. ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ చేపట్టి ధరణిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫైళ్లను పరిష్కరించారు. కేవలం పేరు మార్చడమే ఇక తరువాయి. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయిపోయింది. ఇక కొత్త చట్టంతో సంబంధించిన దరఖాస్తులే పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ ముందు నుంచి చెబుతున్నట్లుగా ధరణి సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి ధృఢ సంకల్పంతో ఉన్నారు. పాత సమస్యలన్నీ స్టడీ చేయించి వాటి స్థానంలో సరికొత్త పోర్టల్ తో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా, ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా పారదర్శకంగా భూమాత పోర్టల్ రూపొందించనున్నట్లు సమాచారం.
పైలెట్ ప్రాజెక్టుగా..
కొత్త చట్టంతో ముడిపడి ఉన్న అంశాలకు సంబంధించిన దరఖాస్తులే మిగిలిపోయినట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఇక కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తెచ్చేందుకు రేవంత్ సర్కార్ కృషి చేస్తోంది. రంగారెడ్డి ,నల్గొండ జిల్లాలలోని మండలాలను పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టి నిర్ణీత కాల పరిధిలో అక్కడి సమస్యలు పరిష్కరించి దాని ఫలితాల ఆధారంగా ఇక రాష్ట్రవ్యాప్తంగా భూమాత పోర్టల్ ని విస్తరింపజేయాలనే యోచనలో ఉన్నారు అధికారులు. ఇందుకు సీఎం రేవంత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సాధ్యమైనంత తొందరలోనే భూమాత పోర్టల్ రానున్నది. భూమాత పోర్టల్ తో తెలంగాణ ముఖ చిత్రం కూడా మారనుంది.