వైసీపీ అండచూసుకుని అప్పట్లో తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత టోటల్ గా ఆ పార్టీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చి పడేశారు. మంగళవారం టీటీడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ సీపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి వైకాపా ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ బ్రష్టుపట్టిపోయాయని ..వాటన్నింటినీ గాడిలో పెట్టే పనిలో ఉన్నామని తెలిపారు. గత ఐదేళ్లుగా ఎన్నో అత్యాచారాలు, హత్యలు, ఆర్థిక నేరాలు జరిగాయని వాటిపై జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
తప్పులన్నీ మీవే
నిరంతరం తప్పులు చేసే వైసీపీ నేతలకు తాము సమాధానం చెప్పవలసిన అవసరం లేదని అనిత స్పష్టం చేశారు. తమని ఓట్లేసి గెలిపించిన ప్రజలకే తాము జవాబుదారీగా ఉంటామని అన్నారు. వైఎస్ఆర్ సీపీ పాలనలో రాష్ట్రంలో ఎక్కడా కూడా సీసీ కెమెరాలు పనిచేయలేదని ఆరోపించారు. టోటల్ గా పోలీసు యంత్రాంగాన్నే నిర్వీర్యం చేసిన ఘనత జగన్ దే నన్నారు.
వ్యవస్థను గాడిలో పెడుతున్నాం
పోలీసు వ్యవస్థను మళ్లీ సక్రమమైన మార్గంలో పెట్టేందుకు కోట్లు ఖర్చుచేయాల్సి వచ్చిందని అన్నారు. వైసీపీ నేతలు పబ్లిక్ గా గంజాయి పండించి కోట్లు గడించారని అన్నారు. జగన్ కు అసలు ప్రత్యేక కోర్టు అంటే తెలుసా అన్నారు. అప్పటి ప్రభుత్వ హయాంలో నేరస్థులు యథేచ్ఛగా నేరాలు చేసి ఆరు నెలల దాకా అస్సలు దొరికేవారు కాదని అన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని.. నేరం జరిగిన 24 గంటలలోపే నిందితులను పట్టుకుని పోలీసులు తమ సత్తా చాటుతున్నారని అన్నారు. ఆయన ప్రభుత్వ హయాంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే పరామర్శించని నేత ఇప్పుడు మాత్రం పరామర్శించడానికి రావడంలో అర్థం లేదని హోం మంత్రి వంగలపూడి అనిత జగన్ తీరును దుయ్యబట్టారు.