క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటే మూడు గవర్నమెంట్ ఆఫీసులు, నలుగురు అధికారులు, సిబ్బంది చుట్టూ కనీసం వారం రోజులైనా తిరగాల్సిందే. కరెంటు, నల్లా, ఇంటి పన్ను, ఇతరత్రా బిల్లులు చెల్లించాలంటే సంబంధిత కార్యాలయాల్లో ఇప్పటికీ ఎడతెగని క్యూలో నిరీక్షణ తప్పదు. అయితే ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఈ కష్టాలన్నీ ఉండవు.
మంత్రి నారా లోకేశ్ చొరవతో పౌరసేవలు సులభతరం కానున్నాయి. మెటా-ఏపీ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందంతో వాట్సప్‌లో ఒకే ఒక్క మెసేజ్ చేస్తే అతి సులువుగా, అంతకుమించి వేగంగా సర్టిఫికేట్లు రానున్నాయి. ఢిల్లీలోని 1 జన్‌పథ్ వేదికగా ఎంవోయూ కార్యక్రమం జరిగింది.
ఇదొక మైలురాయి
యువగళం హామీలు నెరవేర్చడంలో మెటాతో ఒప్పందం ఒక మైలురాయి అని లోకేశ్ అభివర్ణించారు. ‘యువగళం పాదయాత్రలో విద్యార్థులు, నిరుద్యోగులు పలు సర్టిఫికెట్ల కోసం పడుతున్న కష్టాలు ప్రత్యక్షంగా చూశాను. మొబైల్‌లోనే సర్టిఫికెట్లు అందిస్తామని హామీ ఇచ్చా. మాట ఇచ్చినట్టే అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే మెటాతో ఒప్పందం ద్వారా వాట్సప్‌లోనే సర్టిఫికెట్లు, పౌరసేవలు పొందేలా ఒప్పందం చేసుకున్నాం’ అని మంత్రి తెలిపారు.
చాలా సంతోషం
వాట్సప్ ద్వారా మెటాను వాడుకొని ఏపీ ప్రజలకు పౌర సేవలను అందించేందుకు ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంధ్యా దేవనాథన్ అన్నారు. పౌరులు అందరూ తమకు కావాల్సిన సేవలు పొందేందుకు వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, వాట్సప్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ ఉంటుందన్నారు. డిజిటల్ టెక్నాలజీని వాడుకొని ఏపీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మరిన్ని ఉత్తమసేవలు అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.