ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేర్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పెరిగిన పింఛన్లను అందిస్తుండగా దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అతి త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర రూ.850గా ఉంది. మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంవల్ల ఏడాదికి రూ.2550 లబ్ధి వినియోగదారులకు చేకూరనుంది.
తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికా?
ఈ పథకానికి అర్హులెవరనేది ప్రభుత్వం ప్రకటించబోతోంది. నిన్న జరిగిన కేబినెట్ భేటీలో ఈ విషయంపై చర్చ జరిగింది. తెల్ల రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకుంటే ఏపీలో 1.47 కోట్లమంది కార్డుదారులు ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తున్నారనే విషయంపై అధికారులు నివేదిక రూపొందించారు. మంత్రుల కమిటీ కూడా దీనిపై కొన్ని సిఫార్సులు చేసింది. మార్గదర్శకాలు విడుదల చేయాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సిఫార్సులను ఆమోదించాల్సి ఉంది. ఆయన ఆమోదించిన తర్వాత వీటిని ప్రకటించబోతున్నారు.
ప్రతి మహిళ ఈకేవైసీ చేయించుకోవాలి
ఈ పథకాన్ని పొందేందుకు గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తన పేరుమీద ఉన్న ప్రతి మహిళ సంబంధిత డీలరు దగ్గరకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలి. ఈ కేవైసీ చేయించుకోవడంలో తాత్సారం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఆధారు కార్డు నెంబరు ఇచ్చి వేలిముద్రలు వేస్తే రెండు నిముషాల్లో ఈకేవైసీ అయిపోతుంది. కేబినెట్ భేటీలో మంత్రివర్గం పలు విషయాలను చర్చించింది. రహదారులు భవనాలశాఖ ఆధ్వర్యంలోని రహదారులపై గుంతలను పూడ్చడానికి రూ.600 కోట్లు విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అవసరమైతే మరో రూ.300 కోట్లు విడుదల చేస్తానన్నారు. ప్రజలు తమ సొంత అవసరాలకు ఇసుక తెచ్చుకోవచ్చని, దీనికి ఎవరైనా ప్రజాప్రతినిధులు అడ్డుపడినా, మద్యం విషయంలో అడ్డుపడినా కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు