UPDATES  

NEWS

 కమలాపురంలో వైసీపీ ఖాళీ.. జగన్ మేనమామ రవీంద్రనాథ్‌కు టీడీపీ ఝలక్..

వైఎస్సార్ కడప జిల్లాలోని వైసీపీ చేతిలో ఉన్న కమలాపురం పురపాలక సంఘం టీడీపీ వశమైంది. జగన్‌ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ ఝలక్‌ ఇచ్చింది. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులు కావడంతో పాటు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి నాయకత్వంపై నమ్మకంతో పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ మర్పూరి మేరీ, కౌన్సిలర్లు షేక్‌నూరి, రాజేశ్వరి, సలీల, నాగమణి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో గతంతో పాటు తాజాగా చేరిన కౌన్సిలర్లతో టీడీపీ సంఖ్యా బలం పదికి చేరగా… వైసీపీ బలం 8కి పడిపోయింది. దాంతో మున్సిపల్ చైర్మన్ పీఠం తెలుగుదేశంకు దక్కినట్లయింది.

 

త్వరలో పురపాలక సర్వసభ్య సమావేశం నిర్వహించి ఛైర్మన్‌ను ఎన్నుకునేందుకు టీడీపీ సన్నాహాలు చేస్తోంది. వైసీపీకి మిగిలిఉన్న 8 మంది కౌన్సిలర్లలో మరి కొందరు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు. వైసీపీ అధినేత జగన్‌ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి కమలాపురం నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

 

గత రెండు ఎన్నికల్లో రవీంద్రనాథ్‌రెడ్డి కమలాపురం నుంచి పుత్తా నరసింహారెడ్డిపై విజయం సాధించారు. 2014లో 5 వేల ఓట్ల తేడాతో గెలిచిన జగన్ మేనమామ.. 2019లో దాదాపు 27 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించి కమలాపురంలో తనకు ఎదురులేదని ధీమా వ్యక్తం చేశారు. అయితే గత ఎన్నికల్లో పుత్తా నరసింహారెడ్డి వారసుడు పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి దాదాపు 26 వేల మెజార్టీ సాధించి కమలాపురంలో టీడీపీ జెండా పాతారు.

 

రవీంద్రనాథ్‌రెడ్డి ఓటమి తర్వాత కమలాపురంలో వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నుంచి 15 మంది, టీడీపీ తరఫున అయిదుగురు కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో ఛైర్మన్‌ పీఠం వైసీపీ వశం కాగా.. రాష్ట్రంలో తాజా పరిణామాలతో లెక్కలు తారుమారవుతున్నాయి. కమలాపురం పురపాలక సంఘం వైసీపీ చేతిలో ఉండటంతో.. అభివృద్ధికి ఆటంకంగానే మారిందని ఆ పార్టీ నేతలు చెప్తూ రవీంద్రనాథ్‌రెడ్డికి ఝలక్ ఇచ్చారు.

 

ఇటీవల వీరపునాయునిపల్లె జడ్పీటీసీ సభ్యుడు వైసీపీకి రాజీనామా చేశారు. తాజాగా జడ్పీటీసీ మాజీ సభ్యుడు మస్తాన్‌తో పాటు వైసీపీ నేతలు సుబ్బరాయుడు, రాజారెడ్డి, ఖాద్రి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం కమలాపురాన్ని అన్యాయంగా పురపాలక సంఘంగా మార్చారని, పంచాయతీగా ఉంటేనే ప్రజలకు మేలు జరిగిందని పుత్తా నరసింహారెడ్డి అన్నారు. త్వరలో పురపాలక సర్వసభ్య సమావేశం నిర్వహించి పురపాలక సంఘంగా ఉండాలా?.. లేక గ్రామ పంచాయతీగా మార్చాలా? నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

 

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కమలాపురం గ్రామపంచాయతీగా ఉన్న సమయంలోనే అండర్ డ్రైనేజీని తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం నాయకులదని ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి ఈ సందర్భంగా అన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ అండర్ డ్రైనేజీ పనులను ఆర్థికంగా సంపాదించుకోవడానికి ఉపయోగించుకుందని విమ‌ర్శించారు. మొత్తానికి జగన్ మేనమామ సెగ్మెంట్లో ఫ్యాను పార్టీ పరిస్థితి అలా తయారైంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |