కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలను తీసుకుంది. పాకిస్థాన్ సరిహద్దు గ్రామాలతో కనెక్టివిటీ పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. దీనితోపాటు మరికొన్ని నిర్ణయాలను కూడా కేంద్రం తీసుకుంది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గ సమావేశంలో ఏ యే అంశాలపై చర్చించారు.. ఏయే నిర్ణయాలు తీసుకున్నారనేదానిపై ఆయన వివరించారు.
‘కేబినెట్ సమావేశంలో చాలా అంశాలపై చర్చించాం. అనంతరం చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌లోని లోథల్ వద్ద దీనిని ఏర్పాటు చేయనున్నారు. అలాగే, పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల రోడ్లపై ఫోకస్ పెట్టింది మోదీ సర్కార్. రూ. 4,406 కోట్లతో రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో సరిహద్దు రోడ్ల అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది. వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం కింద రోడ్లు, టెలికాం, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్య అందించేందుకు ఆమోదం తెలిపింది. 2,280 కిలోమీటర్ల మేర రాజస్థాన్, పంజాబ్‌లో కొత్త రోడ్ల నిర్మాణం జరగనుంది. పాకిస్తాన్ సరిహద్దు గ్రామాలకు కనెక్టివిటీ కోసం, హైవేతో అనుసంధానం చేసేందుకు ప్లాన్ చేసింది.
ఇక, రూ.17,082 కోట్లతో ఫోర్టిఫైడ్ రైస్ సరఫరాకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐసీడీఎస్, పీఎం పోషన్ సహా అన్ని పథకాల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా కానుంది. రక్త హీనత, శరీరంలో మైక్రో న్యూట్రియంట్ల కొరతను అధిగమించడమే లక్ష్యంగా దీన్ని చేపడుతోంది. 2024 జులై నుంచి 2028 డిసెంబర్ వరకు ఈ పథకం అమలు కానుంది. పూర్తిగా 100 శాతం కేంద్ర నిధులతోనే ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా జరగనుంది. దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది. పోషకాహార లోపాన్ని అధిగమించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది’ అని ఆయన చెప్పారు.