విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. నాలుగు రోజుల క్రితం దాదాపు 4200 మంది ఒప్పంద కార్మికులను యాజమాన్యం విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దీంతో కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ ఇటీవల ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని భావించిన యాజమాన్యం వారిని విధుల్లోకి తీసుకునేందుకు అంగీకరించింది.
ఈ మేరకు ప్రాంతీయ లేబర్ కమిషనర్ సమక్షంలో కాంట్రాక్ట్ పత్రాలపై కార్మిక సంఘాల ప్రతినిధులు సంతకాలు చేశారు. కాగా, సెప్టెంబర్ 27న కొత్త స్టీల్ ప్లాంట్ లో 4200 కార్మికుల ఎంట్రీ పాసులను నిలుపుదల చేసింది. సెప్టెంబర్ 29న కొత్త గేట్ పాస్ విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఆన్ లైన్ లో వారి ఎంట్రీ పాసులను తీసివేయడంతో ప్లాంట్ లోపలికి సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది అనుమతించలేదు. వారి సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో కాంట్రాక్ట్ కార్మికులు ఈడీ వర్క్స్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేశారు.
కొందరు కార్మికులు ఆగ్రహంతో కార్యాలయ అద్దాలను ధ్వంసం చేశారు. తక్షణమే సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి పరిస్థితి చేజారకుండా చర్యలు చేపట్టింది. వారిని అక్కడే నిరసన చేసేందుకు అనుమతించింది. సమస్యకు పరిష్కారం లభించే వరకూ తాము ఇక్కడ్నుంచి కదిలేది లేదని కార్మికులు అక్కడే నిరసన చేపట్టారు. రాత్రంతా అదే భవనంలో ఉండిపోయారు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం కూర్మన్నపాలెం కూడలి వద్ద వారు నిరసనకు దిగారు.
ఈ నేపథ్యంలో జరిగిన చర్చలతో సాయంత్రానికి సమస్యకు పరిష్కారం లభించింది. దీంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న గేట్ పాస్ విధానాన్ని కొనసాగిస్తామని యాజమాన్యం అంగీకరించింది. వారం రోజుల్లోగా ఆన్ లైన్ గేట్ పాస్ విధానాన్ని పునరుద్ధరించడానికి లేబర్ చట్టాలను అమలు చేయడానికి కూడా అంగీకరించింది. దీంతో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు.