ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్దం అవుతోంది. డిస్కంలు తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపు పైన ఈఆర్సీకి ప్రతిపాదనలు చేసాయి. దాదాపు రూ 8,113 కోట్ల మేర ప్రజల పైన భారం పడనుంది. అయితే, ఈ ప్రతిపాదనల్లో ప్రధానంగా గృహ విద్యుత్ వినియోగదారులపైనే అత్యధిక భారం పడనుంది. ఈఆర్సీ బహిరంగ విచారణ తరువాత పెంపు పైన నిర్ణయం తీసుకోనున్నారు.
కసరత్తు
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు పైన కసరత్తు జరుగుతోంది. 2022-23 సంవత్సరంలోనే ఇంధన కొనుగోలు వ్యత్యాసాల సర్దుపోటు భారం రూ.8,113 కోట్లు రాష్ట్ర ప్రజలపై పడబోతోంది. ఇందులో గృహ విద్యుత్ వినియోగదారులపైనే అత్యధిక భారం పడనుంది. ఇది సగటున యూనిట్‌కు రూ.1.27 చొప్పున ఉంటుందని సాక్షాత్తూ డిస్కంలూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి నివేదించాయి. ఈ మేరకు 2022 సెప్టెంబరు 29న ప్రతిపాదనలు సమర్పించాయి.
సర్దుపోటు పేరుతో
సర్దుపోటు భారం రూ.8,113 కోట్లలో గృహ వినియోగదారులపై రూ.2191 కోట్లు, వాణిజ్య వినియోగదారులపై రూ.669 కోట్లు, వ్యవసాయంపై రూ.1,901 కోట్లు, పరిశ్రమలపై రూ.547 కోట్లు, ఇతరులపై రూ.55 కోట్లు ఉంటుందని ఇంధనశాఖ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 18న ప్రజాభిప్రాయ సేకరణ జరిగాక.. సర్దుపోటుపై ఏపీఈఆర్‌సీ ఆదేశాలు జారీ చేస్తుందని డిస్కంలు చెబుతున్నాయి. 2022-23లో విద్యుత్ రంగం భారీ ఒడిదొడుకులు ఎదుర్కొన్నట్లు కమిషన్‌కు పంపిన ప్రతిపాదనల్లో ఆ సంస్థలు పేర్కొన్నాయి. కరోనా కారణంగా ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని తెలిపాయి.
తుది నిర్ణయం
ఈ డిమాండ్‌ను తట్టుకునేందుకు బయట నుంచి విద్యుత్‌ను స్వల్పవ్యవధి కింద కొనుగోలు చేసినట్లు వెల్లడించాయి. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.6,522 కోట్లతో 8,394 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాయి. కాగా.. డిస్కంలు రుణభారంతో విలవిలలాడుతున్నాయి. ఈ నెల 18న ప్రజాభిప్రాయం సేకరిస్తామని ప్రకటించాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే 2023-24 సంవత్సరానికి గాను రూ.11,826.82 కోట్ల ట్రూఅప్ చార్జీలు వసూలు చేసుకోవడానికి ఈఆర్‌సీని డిస్కంలు అనుమతి కోరాయి.