ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం పైన ఇంకా ఆగ్రహ జలాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే సత్యం సుందరం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తిరుమల లడ్డు గురించి లడ్డు గురించి కార్తీ వ్యాఖ్యలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీలో ఈ వ్యవహారం దుమారంగా మారింది.
సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లడ్డుపై వ్యాఖ్యల దుమారం
హీరో కార్తీ సత్యం సుందరం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరగగా ఆ వేడుకలో యాంకర్ కార్తీ తో మాట్లాడుతూ లడ్డు కావాలా నాయనా అని అడిగారు. దీంతో కార్తీ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు లడ్డు గురించి వద్దు.. అది చాలా సెన్సిటివ్ మేటర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. మీకోసం మోతీచూర్ లడ్డు తెప్పిస్తామని యాంకర్ అడగడంతో ఇప్పుడైతే వద్దు అంటూ కార్తి నవ్వుతూ చెప్పారు.
తిరుమల లడ్డు మీద జోకులా
దీంతో ఈ సందర్భంగా అక్కడ నవ్వులు విరబూశాయి. ఇక ఈ ఘటన పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.లడ్డు మీద నిన్న ఒక సినిమా ఫంక్షన్ లో జోకులు వేసుకున్నారని, అలాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేయొద్దు అంటూ హెచ్చరించారు. సినిమా వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు సనాతన ధర్మానికి మద్దతుగా మాట్లాడాలని లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలని అన్నారు.
సినిమావాళ్ళు అలోచించి మాట్లాడాలన్న పవన్ కళ్యాణ్
మీ మీద మాకు గౌరవం ఉందని మీ నటన తమకు నచ్చుతుందని చెప్పిన పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడే ముందు 1000 సార్లు ఆలోచించుకోవాలని సూచించారు. సినిమా ప్రేక్షకులు అందరూ కూడా సనాతన ధర్మాన్ని గౌరవించాలని, మీరు అభిమానించే హీరోలు అందరికంటే కూడా ధర్మమే గొప్పదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు.
పవన్ వ్యాఖ్యలకు బదులిచ్చిన కార్తీ
అయితే పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన సినిమా ఫంక్షన్ లో లడ్డు గురించి జరిగిన చర్చపైన వ్యాఖ్యలు చేయగా హీరో కార్తీ పైన కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వెల్లువగా మారాయి.ఈ క్రమంలో హీరో కార్తీ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.
పవన్ కళ్యాణ్ సార్ అంటూ కార్తీ ట్వీట్
ఆ పోస్టులో ప్రియమైన పవన్ కళ్యాణ్ సార్ మీ పట్ల మాకు ప్రగాఢమైన గౌరవం ఉందని, ఏదైనా అనుకోని అపార్థం చోటు చేసుకుంటే దానికి నేను క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామి పట్ల అత్యంత భక్తిని కలిగి ఉన్నవాడిగా నేను ఎల్లప్పుడూ మన సాంప్రదాయాలను గౌరవిస్తానని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
క్షమించండి అన్న కార్తీ
తాను తిరుమల లడ్డు గురించే ఏదైనా మాట్లాడింది అపార్ధానికి కారణం అయితే క్షమించమని కోరుతూ కార్తీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగానూ అన్ని వర్గాలలోను తిరుమల లడ్డు పైన జరుగుతున్న చర్చ ప్రస్తుతం రచ్చకు కారణమవుతుంది.