మిగిలిన శాఖలకు ఉండే పూర్తి స్వేచ్ఛ హైడ్రాకు కూడా ఉంటుందని, ఈ మేరకు నిబంధనలను సడలించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైడ్రాకు అవసరమైన సిబ్బందిని వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై రప్పిస్తున్నట్లు చెప్పారు. 169 మంది అధికారులు, 964 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని రప్పిస్తున్నామన్నారు.
ఈరోజు సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు.
రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్‌మెంట్ ఖరారుకు ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 12 మందితో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కమిటీ కన్వీనర్‌గా ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారని తెలిపారు.
ఓఆర్ఆర్ లోపల 27 అర్బన్, లోకల్ బాడీలు ఉన్నాయన్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న 51 గ్రామ పంచాయతీలను కోర్ అర్బన్‌లో చేర్చినట్లు వెల్లడించారు.
మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు, హ్యాండ్లూమ్ టెక్నాలజీ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని నిర్ణయించామన్నారు. పోలీస్ ఆరోగ్య భద్రత స్కీం ఎస్‌పీఎల్‌కు కూడా వర్తింపజేయాలని నిర్ణయించామన్నారు. సన్నాలకు ఈ ఖరీఫ్ నుంచి రూ.500 మద్దతు ధరను అందిస్తామన్నారు.