తెలంగాణ రాష్ట్రాన్ని దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్చలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో క్రీడలు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీపై మాట్లాడారు. దశాబ్ధాల క్రితమే ఆఫ్రో, ఏషినయన్ గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చిన ఘనత హైదరాబాద్‌కు ఉందని, ఒలింపిక్స్‌కు కూడా వేదికగా మార్చాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలోని క్రీడా శిక్షణ సంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతోపాటు ప్రతీ ఆటకు ప్రాధాన్యమిచ్చేలా అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలని సీఎం సూచించారు. యూనివర్సిటీల్లోని క్రీడా విభాగాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్రీడా పాఠశాలలు, అకాడమీలు, శిక్షణ సంస్థలను స్పోర్ట్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఇందులో మన క్రీడాకారులు రాణిస్తున్న షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, అర్చరీ, జావెలిన్ త్రో, హాకీలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
ప్రతి క్రీడలో పతకాలు దక్కేలా రాష్ట్ర యువతను తయారు చేయాలని సీఎం తెలిపారు. అనుభవం ఉన్న కోచ్‌లతో శిక్షణ ఇప్పించడంతోపాటు క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందించాలని సూచించారు. ఇటీవల ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారుల శిక్షణపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో ఒక స్పోర్ట్స్ పాఠశాల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాల విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను ఉపాధ్యాయులు గుర్తించాలన్నారు. పాఠశాలల్లో విద్యాబోధనతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతిభ ఆధారంగా స్పోర్ట్స్ యూనివర్సిటీలో వసతి కల్పించడంతోపాటు మెరుగైన శిక్షణ ఇప్పించాలన్నారు.