ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న కొమ్మా శివచంద్రారెడ్డి భద్రతపై ఇవాళ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనకు ఉన్న భద్రతను తాజాగా కడప ఎస్పీ తొలగించడంపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో తనకు ముప్పు ఉందని, కాబట్టి తనకు భద్రత పునరుద్ధరించారని ఆయన కోరారు. దీనిపై హైకోర్టు స్పందించింది.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న కొమ్మా శివచంద్రారెడ్డికి తొలగించిన భద్రతను తక్షణం పునరుద్దించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన తనకు గతంలో కడప జిల్లా జడ్జి మంజూరు చేసిన సెక్యూరిటీ గన్మెన్లను ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. గతంలో తన కుటుంబానికి తనకి జగన్, అవినాష్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉన్నదని విట్నెస్ ప్రొటెక్షన్ స్కీం 2018 క్రింద గన్ మెన్ లను పొందారు. దీన్ని నాలుగు రోజుల క్రితం కడప ఎస్పీ ఉపసంహరించారు.
తన పిటిషనర్ కు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కడప ఎస్పీ తొలగించారని ఆయన తరఫు లాయర్ జడ శ్రావణ్ కుమార్ వాదించారు. పిటిషనర్ కు ఆతని కుటుంబానికి ప్రాణహాని ఉన్నందున తక్షణమే భద్రత పునరుద్ధరించాలని కోరారు. దీంతో పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. కడప జిల్లా జడ్జి అనుమతి లేకుండా సెక్యూరిటీ ఉపసంహరించుకోవడం చట్ట విరుద్ధమని తెలిపింది. తక్షణమే పిటిషనర్ కు గన్ మెన్ ప్రొటెక్షన్ పునరుద్దించాలని కడప జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చింది. కడప జడ్జి అనుమతి లేకుండా భద్రత ఉపసంహరించొద్దని ఆదేశించింది.