ఏపీలో పేదల ఇళ్ల స్థలాలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల కంటే ఎక్కువ పరిమాణంలో స్థలాల్ని ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇవాళ జరిగిన గృహనిర్మాణ శాఖ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఒకలా, పట్టణ ప్రాంతాల్లో మరోలా ఈ సైజు పెరగబోతోంది. దీంతోపాటు ఇళ్లు నిర్మించేందుకు కూడా ప్రభుత్వం సహకరించనుంది.
రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో పట్టణ ప్రాంతాల్లో పేదలకు సెంటు చొప్పున, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర చొప్పున ఇళ్ల స్థలాల నిర్మాణం కోసం భూమిని నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇచ్చారు. అప్పట్లో ఈ స్థలం ఇల్లు కట్టుకునేందుకు ఏమాత్రం సరిపోదని విపక్షంలో ఉన్న కూటమి పార్టీలు విమర్శలు చేసేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీటిని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సీఎం చంద్రబాబు తాజా నిర్ణయం ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాల నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వబోతున్నారు. అయితే కొత్తగా ఇళ్ల స్థలాలు కేటాయించే వారికే దీన్ని పరిమితం చేయబోతున్నారు. గతంలో ఇళ్ల స్థలాలు తీసుకున్న వారికి ఇది వర్తించదు. అలాగే రాబోయే 100 రోజుల్లో ఆయా స్థలాల్లో గృహనిర్మాణాల కోసం ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు జర్నలిస్టులకు సైతం తక్కువ ధరలో ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.