తెలంగాణలో రుణమాఫీ రెండోదశకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రుణమాఫీ మూడు దఫాలుగా చేస్తామని ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రూ.లక్షల్లోపు రుణాలను మాఫీ చేశారు. మంగళవారం రైతుల రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అంశంపై ఆర్థిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
రూ.1.50 లక్షల్లోపు రుణాలున్న వారి ఖాతాల్లో మాఫీ డబ్బులు జమను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే ఇప్పటికే రూ.లక్షలోపు రుణాలున్న వారికి మాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు ఆగస్టు నెలఖారులోగా రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
రూ.లక్షన్నర లోపు ఉన్న రైతుల ఖాతాల్లోకి నిధులు పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో అసెంబ్లీ ఆవరణలోనే దీనికి సంబంధించిన విషయంపై ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, మొదటి విడతలో రూ.లక్ష వరకు మాఫీ చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా కొంతమంది రైతుల ఖాతాల్లో నగదు జమ కాలేదని పలు ఫిర్యాదులు అందాయని మంత్రి తుమ్మల చెప్పారు.
మొదటి విడతలో రూ.లక్ష రుణాలు ఉణ్న అందరికీ మాఫీ అవుతుందని, ఎవరూ అధైర్యపడవద్దని మంత్రి సూచించారు. ఈ రుణ మాఫీ నగదును రిజర్వ్ బ్యాంకు ఈ కుబేర్ విధానంలో జమ చేస్తున్నట్లు తెలిపారు. కాగా, మొదటి విడతలో 17,877 మంది లబ్ధిదారుల్లో 84.94 కోట్ల నిధులు జమ కాలేదన్నారు. దీనికి సంబంధించిన నిధులు ఆర్బీఐ వద్దనే ఉన్నాయని తెలిపారు.