తెలంగాణ ప్రభుత్వ స్ఫూర్తితో ఏపీలో చంద్ర బాబు కూడా ఆడవారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల ముందు వాగ్ధానం చేశారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి అందుకు సంబంధించిన నివేదికలు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదంతా ఇప్పుడు ఓ కొలిక్కి తెచ్చిన అధికారులు సీఎం చంద్రబాబుకు తమ నివేదికలు సమర్పించారు. అయితే సోమవారం దీనిపై ఏపీలో సమీక్ష సమావేశం నిర్వహించి దీనిపై కీలక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు సీఎం చంద్రబాబు.
రుణ భారం రూ.250 కోట్లు
ఆడవారికి ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడం ద్వారా ప్రభుత్వంపై రూ.250 కోట్ల భారం పడనుంది. ఇప్పటికే ఈ పథకం కర్ణాటక, తెలంగాణలో విజయవంతంగా అమలవుతోంది. అయితే ఏ ఏ బస్సులలో ఈ సదుపాయం కల్పిస్తే బాగుంటుంది? దానికి కూడా కొన్ని పరిమితులు వంటి అంశాలు అన్నీ సోమవారం సమీక్షలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో జీరో టిక్కెట్ విధానం అమలు చేస్తున్నారు. దీని వలన ప్రయాణికులు డబ్బులు చెల్లించకపోయినా దాని విలువ ఈ టిక్కెట్ ద్వారా మిషన్ లో కౌంట్ అవుతుంది. దీనితో రోజుకు ఎంత మంది ప్రయాణం చేశారు..ఎంత ఖర్చయింది అన్న విషయం ఏ రోజుకారోజు లెక్కలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏపీలోనూ జీరో టిక్కెట్ విధానాన్ని అమలు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఆదాయ మార్గాలపై చర్చ
అన్నీ అంశాలు అనుకూలంగా ఉంటే ఆగస్టు 1 నుంచి గానీ లేక 15 నుంచి గానీ ఈ పథకాన్ని ఏపీలో ప్రారంభించాలని చంద్రబాబు భావిస్తున్నారు. పల్లె వెలుగుకు మాత్రమే ఉచిత సర్వీసు అమలు చేద్దామా లేక ఎక్స్ ప్రెస్ బస్సులలో కూడా అమలు చేద్దామా అలాగే విజయవాడ, విశాఖ వంటి సిటీలలో మెట్రో బస్సులలోనూ మహిళలకు ఉచిత బస్సు ఫెసిలిటీ ఇద్దామా అనే అంశాలన్నీ సోమవారం సమీక్షలో చర్చకు రానున్నాయి. ఏపీలో రోజుకు 30 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ఇప్పుడు మహిళలకు ఉచితం ప్రకటిస్తే అందులో సగానికి సగం ఆదాయం తగ్గిపోతుంది. అందుకోసం ఆర్టీసీ లో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఆదాయం పెంచుకునే దిశగా ఏపీ సర్కార్ పయనిస్తోంది.