UPDATES  

NEWS

 కాశ్మీర్‌లో ఉగ్రవాదుల భారీ దాడి..! కేంద్రం హైఅలర్ట్..!

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. సైనిక పికెట్లపై పెద్ద ఎత్తున దాడికి దిగారు. ఈ దాడిని సరిహద్దు భధ్రత దళానికి చెందిన జవాన్లు తిప్పికొడుతున్నారు. కాల్పులతో ఈ ప్రాంతం మొత్తం హోరెత్తిపోతోంది. ఈ సమాచారంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అదనపు బలగాలను సంఘటన ప్రాంతానికి తరలిస్తోంది.

 

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో భారత్-పాకిస్తాన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న గుంధా ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదుల దాడి విషయాన్ని ఆర్మీ ఉన్నతాధికారులు ధృవీకరించారు. ఆర్మీ పికెట్‌పై టెర్రరిస్టులు దాడికి పాల్పడినట్లు జమ్మూ డిఫెన్స్ పీఆర్ఓ వెల్లడించారు. కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

 

ఈ తెల్లవారు జామున 4 గంటల సమయంలో జవాన్లు గుంధా ఏరియాలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తోండగా.. ఉగ్రవాదులు దాడికి దిగారు. ఈ ఘటనలో ఒక జవాన్ గాయపడినట్లు సమాచారం. సరిహద్దులను దాటుకుని చొరబడ్డ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో తలదాచుకున్నట్లు పక్కాగా అందిన సమాచారం మేరకు జవాన్లు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

 

మూడు వారాల వ్యవధిలో జమ్మూ కాశ్మీర్‌లో సంభవించిన మూడో అతిపెద్ద దాడి ఘటన ఇది. కొద్దిరోజుల కిందటే ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. మరో అయిదుమంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో కమాండర్ స్థాయి అధికారి ఉన్నారు.

 

అంతకు వారం రోజుల ముందు కథువా జిల్లాలో కూడా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఆర్మీ ట్రక్కులపై గ్రెనేడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో అయిదుమంది సైనికులు కన్నుమూశారు. మరో అయిదుమంది గాయపడ్డారు. జమ్మూ ప్రాంతంలో 32 నెలల్లో 48 మంది సైనికులు వీరమరణం పొందారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |