UPDATES  

NEWS

 స్పీకర్ అయ్యన్న కీలక నిర్ణయం, అసెంబ్లీ గేట్-2 ఓపెన్..

ఏపీలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా అసెంబ్లీ గేటు-2 నుంచి ప్రవేశాలను నిషేధించి నిర్మించిన అడ్డుగోడ తొలగించారు.

 

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. బాధ్యతలు చేపట్టగానే కొన్ని ఛానెళ్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. ఆ సమయంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. దీంతో రామాచార్యులు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్త సూర్యదేవర ప్రసన్న బాధ్యతలు చేపట్టారు.

 

ఇప్పుడు అసెంబ్లీ పరిసరాలపై దృష్టి సారించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. జగన్ ప్రభుత్వంలో అసెంబ్లీ గేటు-2 నుంచి ప్రవేశాలను నిషేధించింది. అంతేకాదు అటువైపు ఎవరూ రాకుండా అడ్డంగా గోడ కట్టేసింది. బుధవారం అసెంబ్లీ పరిసర ప్రాంతాలను గమనించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, గేట్ -2ని తెరిపించారు. అప్పట్లో అడ్డంగా కట్టిన గోడను జేసీబీలతో కూల్చివేయించారు అధికారులు. దీంతో ఆ మార్గం నుంచి ఎమ్మెల్యేల ఎంట్రీకి మార్గం సుగమం అయ్యింది.

 

ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అనేది దేవాలయంతో సమానమన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. అటువంటి దేవాలయం గేటును అమరావతి రైతులు రాజధాని కోసం పోరాటం చేస్తున్న తరుణంలో మూసివేసి అడ్డంగా గోడ కట్టించాడు మాజీ ముఖ్యమంత్రి జగన్. అది చాలా పొరపాటని, అసెంబ్లీ గేటు ఎప్పుడూ తెరుచుకొని ఉండాలి తప్ప మూసుకోని ఉండకూడదని భావించారు. అందుకే ఈ రోజు గోడను కూల్చి గేటును తెరిపించడం జరిగిందని సోషల్‌మీడియాలో రాసుకొచ్చారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

 

స్పీకర్ అయ్యన్నపాత్రుడు దూకుడు చూసి ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాకవుతున్నారు. మరి అసెంబ్లీ సమావేశా ల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు దూకుడును వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి. అన్నట్లు అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్ కూడా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ వర్సెస్ జగన్ అన్నట్లుగా సభ సాగవచ్చని అంటున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |