UPDATES  

NEWS

 ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం..!

సీనియర్ ఐపీఎస్ అధికారి, ఫైర్ సర్వీసులు, విపత్తుల నిర్వహణ విభాగం మాజీ డైరెక్టర్ జనరల్ పీవీ సునీల్ కుమార్‌పై గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సునీల్ కుమార్‌‌పై బదిలీ వేటు పడింది. పోస్టింగ్ లభించలేదు. ప్రస్తుతం ఆయన వెయిటింగ్‌లో ఉన్నారు.

 

వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కొంతకాలం పాటు ఆయన సీఐడీ డైరెక్టర్ జనరల్‌గా పని చేసిన విషయం తెలిసిందే. ఆయన సీఐడీ చీఫ్‌గా ఉన్నప్పుడే రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో అధికారులు తనను కొట్టారని, హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ రఘురామ తాజాగా ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్ పేరు సైతం చేర్చారు.

 

దీనిపై మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ స్పందించారు. ఒక పథకం ప్రకారమే జగన్‌పై తప్పుడు కేసు నమోదు చేశారని, దీని వెనుక పెద్ద కుట్రే ఉందని ఆరోపించారు. జగన్‌తోపాటు కొందరు అధికారులపై‌ టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని మండిపడ్డారు. వ్యక్తిగత ద్వేషంతోనే రఘురామ కృష్ణంరాజు ఈ పని చేశారంటూ విమర్శించారు.

 

రఘురామ కృష్ణంరాజు అరెస్టు విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని పొన్నవోలు తెలిపారు. తనపై మాస్క్ పెట్టుకున్న గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్టు రఘురామ మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో స్వయంగా చెప్పారని, ఇప్పుడేమో ఈ కేసులో జగన్ పేరు రాశారని పేర్కొన్నారు. జగన్, పీవీ సునీల్ కుమార్, సీతారాంజనేయులు తనపై దాడి చేస్తే అప్పట్లోనే కోర్టులో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

 

డాక్టర్లు కూడా రఘురామ ఒంటిపై కొట్టిన గాయాలు లేవని చెప్పారని పొన్నవోలు గుర్తు చేశారు. అయినా కూడా ఇప్పుడు తప్పుడు కేసు పెట్టారని చెప్పారు. రఘురామ జూన్‌ 11వ తేదీన ఫిర్యాదు చేస్తే.. 10వ తేదీనాడే పోలీసులు ఎలా లీగల్ ఒపీనియన్ రాశారని ఆయన నిలదీశారు. ఇది తప్పుడు కేసు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని చెప్పారు.

 

ఒక కేసులో 77 రోజుల తరువాత ఇచ్చిన సాక్ష్యాన్నే చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిందని, మూడేళ్ల కిందటి రఘురామ కేసులో ‌జగన్, ఇతర అధికారులపై ఎలా కేసు నమోదు చేస్తారు? అని పొన్నవోలు నిలదీశారు. రాష్ట్రంలో అత్యంత దారుణంగా హత్యలు జరిగినా పోలీసులు కేసు నమోదు చేయని పరిస్థితి చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఇలాంటి తప్పుడు సంప్రదాయాన్ని అనుసరిస్తే రాబోయే రోజుల్లో కర్మ ఫలితం అనుభవించాల్సి వస్తుందని పొన్నవోలు చెప్పారు. రెడ్ బుక్ రాసుకుని అధికారాన్ని విచ్ఛిన్నం చేయాలని చూడవద్దని, ఇది రెడ్ బుక్ రాజ్యాంగమా అని ప్రశ్నించారు. అదే జరిగితే- అధికారులు ఎవరూ సరిగా ఉద్యోగం చేయలేరని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు కేసులు మానుకోవాలని హితవు పలికారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |