గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం భావితరాల భవిష్యత్‌ను ఎలా నాశనం చేసిందో ప్రజలకు వివరించేందుకే శ్వేత పత్రం విడుదల చేశామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం ఏపీ సచివాలయం సీఎం చంద్రబాబు పవర్ సెక్టార్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు.
ప్రజలు గెలవాలి.. ఏపీ నిలబడాలని పిలుపునిచ్చామన్నారు సీఎం చంద్రబాబు. ప్రజలు గెలిచి మమ్మల్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చే సరికి విద్యుత్ కొరత ఉన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసమర్థులు పాలన చేస్తే ఏమవుతుందో గత ఐదేళ్లలో ఏపీ ప్రజలు చూశారని అన్నారు. అప్పట్లో విద్యుత్ సంస్కరణల వల్ల తన ప్రభుత్వం అధికారం కోల్పోయిందని.. అయినా దేశం బాగుపడిందని అన్నారు. తాను తీసుకొచ్చిన సంస్కరణలు వైఎస్ హయాంలో కనిపించాయన్నారు