మణిపూర్‌లో జాతి కలహాలపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్షాల తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మణిపూర్ వ్యవహారంపై ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఈ అంశంపై మౌనం వీడారు. మణిపూర్ లో హింస నిరంతరం తగ్గుముఖం పడుతుందని అన్నారు. ఈశాన్య రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. ఈ అంశంపై రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలని ప్రతిపక్షాలను కోరారు.
“కొన్ని అంశాలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. అలాంటి అంశాలను మణిపూర్ ప్రజలు తిరస్కరిస్తారు” అని రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కార్యాలయాలు తెరిచినట్లు తెలిపారు. “నేడు మణిపూర్‌లోని చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు నడుస్తున్నాయి. మణిపూర్‌లో కూడా ఇతర ప్రాంతాల మాదిరిగానే అక్కడ పరీక్షలు జరిగాయి” అని ప్రధాని చెప్పారు.
ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే జోక్యం చేసుకొని తన అభిప్రాయాలను చెప్పేందుకు అనుమతించకపోవడంతో ప్రతిపక్ష రాజ్యసభ ఎంపీలు వాకౌట్ చేయడంతో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో పరిస్థితి సాధారణంగా ఉందని పీఎం మోడీ చేసిన ప్రకటన “ఆశ్చర్యకరమైనది” అని కాంగ్రెస్ పేర్కొంది. 2023 మేలో మెజారిటీ మైతే, మైనారిటీ కుకీ వర్గాల మధ్య హింస చెలరేగినప్పటి నుంచి మోడీ ఇప్పటికీ రాష్ట్రాన్ని సందర్శించలేదని గుర్తు చేశారు. “వాస్తవానికి పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది” అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
” మే 3, 2023 రాత్రి మణిపూర్ ఘర్షణలు జరిగినప్పటి నుంచి నాన్-బయోలాజికల్ ప్రధాన మంత్రి ఇప్పటికీ మణిపూర్‌ను సందర్శించలేదు. అలాగే రాష్ట్ర రాజకీయ నాయకులను కూడా కలవలేదు. రాష్ట్రపతి ప్రసంగం కూడా ఈ అంశంపై మౌనంగా ఉంది” అని ఆయన చెప్పారు. సోమవారం మణిపూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ, బిమోల్ అకోయిజం, ఒక సంవత్సరం పాటు ఈ విషాదాన్ని “మూగ ప్రేక్షకుడిగా” చూసినట్లు ప్రభుత్వంపై మండిపడ్డారు.