ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్ణయాలను సమీక్షిస్తోంది. కేసులు నమోదైన నేతల పైన గురి పెట్టింది. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతల పైన కేసులు ఉన్నా…చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో వారి అరెస్ట్ లు మొదలయ్యాయి. ఇప్పటికే వైసీపీ నేత పిన్నెల్లి అరెస్ట్ కాగా..తాజాగా కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను పోలీసులు అరెస్ట్ చేసారు.
కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను పోక్సో కేసులో పోలీసులు అరెస్ట్ చేసారు. తన ఇంట్లో పనిచేసే బాలికతో ఆయన అసభ్యంగా ప్రవర్తించారన్న కారణంతో కేసు నమోదైంది. ఈ ఘటన చాలాకాలం క్రితం జరగగా.. ఇటీవల దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, ఈరోజు కర్నూలులో సుధాకర్ ని అరెస్ట్ చేశారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇదివరకే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్నారు.
జరదొడ్డి సుధాకర్ 2019లో వైసీపీ టికెట్ పై కోడుమూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈ సారి ఆయనకు పార్టీ టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో ఆదిమూలపు సతీష్ పోటీ చేశారు. అక్కడ టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి విజయం సాధించారు. సుధాకర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక, వైసీపీ అధినేత జగన్ నెల్లూరు జైలులో ఈ రోజు పిన్నెల్లిని పరామర్శించారు. తమ పార్టీ కేడర్ పైన జరుగుతున్న దాడుల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదే విధంగా కొనసాగితే ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.









