నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీకేజీకి సంబంధించి దేశవ్యాప్తంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నీట్ పీజీ 2024 పరీక్ష నిర్వహణను వాయిదా వేసింది. అయితే, తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ నెల చివరల్లో లేదా ఆగస్టులో నీట్ పీజీ పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈ వారంలోనే రివైజ్డ్ షెడ్యూల్ ను ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పరీక్షలో అక్రమాలు జరగకుండా చివరి గంటల్లోనే ఎగ్జామ్ పేపర్ ను సిద్ధం చేయాలని అధికారులు యోచిస్తున్నారంటా.
కాగా, జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు పరీక్షకు ఒకరోజు ముందు ప్రకటన చేశారు. రివైడ్జ్ షెడ్యూల్ ను జులై 2న ప్రకటిస్తారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్బీఈ) స్పందించింది. పరీక్ష తేదీని నేడు వెల్లడించడంలేదని పేర్కొన్నది. పరీక్ష నిర్వహణ కోసం తాము సిద్ధం చేసిన ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదని తెలిపింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తరువాతే షెడ్యూల్ ప్రకటిస్తామంటూ స్పష్టం చేసింది.
జులై చివరలో లేదా ఆగస్టులో పరీక్ష నిర్వహించే అవకాశాలున్నాయని తెలిపింది. జులై 5వ తేదీలోగా షెడ్యూల్ ను వెల్లడిస్తామంటూ పేర్కొన్నది. ఇక, నీట్ యూజీ లీకేజ్ వివాదం నేపథ్యంలో నీట్ పీజీ పరీక్ష నిర్వహణ విషయంలో ఎగ్జామినేషన్స్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పరీక్షకు కేవలం 2 గంటల ముందు ఎగ్జామ్ పేపర్ ను సిద్ధం చేసి సెంటర్లకు పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియాలో కథనం వెల్లడయ్యింది.
ఇదిలా ఉంటే.. కేంద్రం రద్దు చేసిన యూజీసీ నెట్ 2024 -UGC NET 2024 పరీక్షకు సంబంధించి కొత్త తేదీలను జాతీయ పరీక్షల సంస్థ-ఎన్టీఏ ఇటీవల ప్రకటించింది. ఆగస్టు 21, సెప్టెంబర్ 4 మధ్య ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. అంతకుముందు నిర్వహించిన పెన్ను, పేపర్ కు బదులుగా ఈసారి కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.