రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయసభలనుద్దేశించి చేసిన ప్రసంగానికి సంప్రదాయంగా ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్ సభలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. విపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ రాష్ట్రపతి ప్రసంగంపై ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానంపై చర్చలో పాల్గొన్న సందర్భంగా ఆయన్ను అడ్డుకునేందుకు అధికార పక్షం విశ్వప్రయత్నాలు చేసింది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సైతం రాహుల్ శివుడి ఫొటోతో సభలోకి రావడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు.
రాహుల్ గాంధీ సభలో శివుడి బొమ్మను చూపించడాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తప్పుబట్టారు. రాహుల్ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్.. నిబంధనలు ప్లకార్డుల ప్రదర్శనను అనుమతించవని గుర్తతుచేశారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… రాజ్యాంగం, భారతదేశం యొక్క ఆలోచన, బీజేపీ ప్రతిపాదించిన ఆలోచనలను ప్రతిఘటించిన మిలియన్ల మంది ప్రజలపై క్రమపద్ధతిలో దాడి జరుగుతోందని ఆరోపించారు.
భారతదేశం, రాజ్యాంగంపై దాడిని ప్రతిఘటించిన వ్యక్తులపై క్రమబద్ధమైన, పూర్తి స్థాయి దాడి జరిగిందని రాహుల్ గాంధీ తెలిపారు. మనలో చాలా మంది వ్యక్తిగతంగా దాడి చేశారన్నారు. కొంతమంది నాయకులు ఇప్పటికీ జైల్లో ఉన్నారని, వారు ఎవరైనా సరే.. అధికారం, సంపద కేంద్రీకరణ ఆలోచనను ప్రతిఘటించి పేదలు, దళితులు, మైనారిటీలపై దౌర్జన్యానికి పాల్పడ్డారని రాహుల్ విమర్శించారు. భారత ప్రభుత్వ ఆదేశంతో, భారత ప్రధాని ఆదేశంతో తనపై దాడి జరిగిందన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 55 గంటల పాటు విచారించడం అందులో అత్యంత ఆనందదాయకమైన అంశమన్నారు.
“హిందూ హింస” అని విపక్ష నేత రాహుల్ చేసిన వ్యాఖ్యపై పార్లమెంట్‌లో పెద్ద దుమారాన్ని రేపింది. అనంతరం లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ, ఇతర సీనియర్ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో, “మన మహానుభావులందరూ అహింస, భయాన్ని తొలగించడం గురించి మాట్లాడారు. కానీ తమను తాము హిందువులుగా చెప్పుకునే వారు హింస, ద్వేషం, అసత్యం గురించి మాత్రమే మాట్లాడతారని ఆరోపించారు.
హిందూ సమాజంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తం హిందూ సమాజాన్ని హింసాత్మకంగా అభివర్ణిండం చాలా తీవ్రమైన విషయమని మోడీ తెలిపారు. ప్రధాని మోదీ జోక్యం తర్వాత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాహుల్ గాంధీపై విమర్శలకు దిగారు. కోట్లాది మంది ప్రజలు హిందువులుగా గర్వపడుతున్నారని, వారంతా హింసాత్మకంగా ఉన్నారని రాహుల్ గాంధీ భావిస్తున్నారా అని ప్రశ్నించారు. హిందువులందరినీ హింసాత్మకంగా చిత్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలకు రాహుల్ క్షమాపణ చెప్పాలన్నారు.