ఏపీ రాజధానిగా గతంలో గుర్తించిన అమరావతిని పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంపై ఇప్పటికే గుర్రుగా ఉన్న కూటమి పార్టీలు.. ఈసారి ఎలాగైనా రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతి రాజధాని పనుల పూర్తిగా ప్రభుత్వం తాజా డెడ్ లైన్ వెల్లడించింది. ఈ మేరకు మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణ కీలక ప్రకటన చేశారు.
రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండున్నరేళ్ల డెడ్ లైన్ పెట్టుకున్నట్లు మున్సిపల్ మంత్రి నారాయణ నిన్న వెల్లడించారు. రెండున్నరేళ్లలో అమరావతి రాజధాని పనులు పూర్తి చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం అమరావతి పనుల పురోగతిపై సమీక్షలు జరుగుతున్నాయని, పది రోజుల్లో దీనిపై ఓ అంచనాకు వచ్చి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు. దీంతో త్వరలో రాజధాని కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది.
అమరావతి రాజధాని నిర్మాణంపై అధ్యయనం కోసం ఓ కమిటిని వేయబోతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ కమిటీ నివేదిక వచ్చేందుకు రెండు, మూడు నెలల సమయం పడుతుందన్నారు. ఆ తర్వాత పనులు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. 10 రోజుల్లో మాత్రం పనుల ప్రారంభంపై స్పష్టత వస్తుందన్నారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామని నారాయణ తెలిపారు.