తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చింది. హస్తం పార్టీ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం తీసుకొచ్చింది. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ ల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఉచిత బస్ సౌకర్యాన్ని మహిళలు భారీగా ఉపయోగించుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకున్నా బస్సుల్లో ప్రయాణాలు చేస్తున్నారు.
దీంతో బస్సుల్లో సీట్ల దొరక్క మిగతా వారు ఇబ్బంది పడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తీసివేయాలన్నారు. లేకుంటే 50 శాతం రాయితీ ఇస్తే అవసరం ఉన్న వారు మాత్రమే బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని చెబుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఉచిత బస్ పథకం కర్ణాటక, తెలంగాణలో అమలు చేస్తున్నారు. మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో కూడా టీడీపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది.
ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఉచిత బస్ పథకం అమలు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ అధికారుల బృందం తెలంగాణ, కర్ణాటకలో అమలు చేస్తున్న విధానం అధ్యయనం చేస్తోంది. ఉచిత బస్ పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలి అనే దానిపై చర్చిస్తున్నారు.మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకానికి తెలంగాణ అనుసరిస్తున్న విధానమే ఏపీకి సరిపోతుందని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
ఏపీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. అలాగే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. తెలంగాణలో ఉన్నట్లే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ వరకు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అవకాశం కల్పించే అవకాశం ఉంది. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఎక్కడి నుంచి ఎక్కడి వెళ్తున్నారో నమోదు చేసి ‘జీరో’ ఛార్జ్‌తో టికెట్ ఇస్తారు. ఆ తర్వాత ఆ టికెట్లను లెక్క గట్టి ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటారు. ఎప్పటి నుంచి ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం కల్పిస్తారో చెప్పలేదు.