ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి . ఏపీలో తెలుగుదేశం కూటమి విజయం తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు షాక్ కు గురి చేస్తున్నాయి. విజయవాడ పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసి ఓటమి పాలైన కేశినేని నాని రాజకీయాలపై ప్రస్తుతం తీసుకున్న సంచలన నిర్ణయం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
కేశినేని నాని ఓటమి గతంలో తెలుగుదేశం పార్టీ నుండి రెండు పర్యాయాలు గెలిచి విజయవాడ ప్రజలకు సేవలు అందించిన కేశినాని నాని, తన సోదరుడితో చోటు చేసుకున్న విభేదాల నేపథ్యంలో టీడీపీకి గుడ్ బై చెప్పి కదా ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కేశినేని చిన్ని చేతిలో సోదరుడు కేశినేని నాని ఓటమిపాలయ్యారు.
రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా : కేశినేని నాని దీంతో తాను తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుండి తాను తప్పుకుంటున్నాను అని కేశినేని నాని తన ఎక్స్ ఖాతా ద్వారా స్పష్టం చేశారు. కేశినేని నాని తాను చేసిన పోస్టులో జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను . నా రాజకీయ ప్రయాణాన్ని ముగిస్తున్నాను అని పేర్కొన్నారు.
విజయవాడ ప్రజలకు మద్దతుగానే ఉంటా రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవం. విజయవాడ ప్రజల స్థైర్యం మరియు దృఢసంకల్పం నాకు స్ఫూర్తినిచ్చాయి, వారి తిరుగులేని మద్దతుకు నేను ప్రగాఢ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ తన పోస్టులో వెల్లడించారు. నేను రాజకీయ రంగానికి దూరంగా ఉన్నా, విజయవాడపైన నిబద్ధత బలంగానే ఉందన్నారు. విజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగిన విధంగా మద్దతు ఇస్తూనే ఉంటానన్నారు.
సహకరించిన అందరికీ ధన్యవాదాలు
నా రాజకీయ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అని కేశినేని నాని పేర్కొన్నారు. నేను నా జీవితంలో తదుపరి అధ్యాయానికి వెళుతున్నానని నేను ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలను, అమూల్యమైన అనుభవాలను నాతో తీసుకువెళుతున్నానని అన్నారు. విజయవాడ అభివృద్ధి, శ్రేయస్సు కోసం పాటుపడే కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా కేశినేని నాని విజయవాడ ప్రజలకు పదేళ్లపాటు సేవ చేసే అపురూపమైన అవకాశాన్ని కల్పించినందుకు మరోసారి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ కేశినేని నాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇకపై తాను ప్రత్యక్ష రాజకీయాలు చేయబోనని వెల్లడించారు. తాజా కేశినేని నాని నిర్ణయం రాష్ట్ర రాజకీయ వర్గాలలో ఆసక్తికరచర్చకు కారణంగా మారింది.