భారతదేశ అభ్యున్నతికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కోసం ఎన్డీయే కూటమి తప్పనిసరిగా పనిచేస్తుందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు. ఢిల్లీ వేదికగా శుక్రవారం జరిగిన ఎన్డీయే సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్‌తో కలిసి ఎంపీ బాలశౌరి పాల్గొన్నారు. తొలుత పవన్ కల్యాణ్‌కు పుష్పగుచ్చం ఇచ్చి ఎంపీ బాలశౌరి స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు కలిసి ఎన్డీయే సమావేశంలో పాల్గొన్నారు.
ఈ మీటింగ్ అనంతరం ఎంపీ కార్యాలయం నుంచి ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఎన్డీయే కూటమి ఏర్పాటుతో భారతదేశం అన్నివిధాలుగా అభ్యున్నతి సాధిస్తుందని ఎంపీ బాలశౌరి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ది పథంలో నడిపేందుకు కూటమి ఎంపీగా అహర్నిశలు కష్టపడతానని ఆయన పేర్కొన్నారు. పోలవరం, మచిలీపట్నం పోర్టు వంటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా కేంద్రం సహాయసహకారాలు తీసుకుంటామన్నారు.
ఎన్డీయే సమావేశానికి అనేక మంది ఇటీవల గెలుపొందిన ఎంపీలు, మాజీ ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్బంగా అనేక మంది ఎంపీలు, మాజీ మంత్రులను ఎంపీ బాలశౌరి ఆత్మీయంగా కలుసుకున్నారు. మచిలీపట్నం ఎంపీగా వరుసగా రెండోసారి గెలుపొందిన అనంతరం దాదాపు మూడు నెలల తర్వాత తోటి ఎంపీలను ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉందని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. అందరి సహాయసహకారాలతో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్ర అభివృద్ది, ముఖ్యంగా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ది కార్యక్రమాలు రానున్నరోజుల్లో చేస్తానని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు.
ఎంపీ బాలశౌరి కలిసిన వారిలో కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి నిర్మాలా సీతారామన్, ప్రస్తుత ఎంపీలు ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి, కిరణ్ రిజుజు, తదితరులు ఉన్నారు. ఇక ఎంపీ బాలశౌరి కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. జనసేన నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీల్లో బాలశౌరి కూడా ఒకరు. ఆయన వరుసగా రెండోసారి మచిలీపట్నం నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుఫున విజయం సాధించిన బాలశౌరి ..2024 ఎన్నికల ముందు జనసేనలో చేరి ఆ పార్టీ నుంచి వరుసగా రెండోసారి ఎంపీగా ఘన విజయం సాధించారు. ఒకవేళ జనసేనకు ఒక కేంద్రమంత్రి పదవి ఇవ్వాలనుకుంటే మాత్రం బాలశౌరి పేరును పరిశీలించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.