లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. నైతికంగా పరాజయం పొందినప్పటికీ ప్రజా విధానాలకు వ్యతిరేకంగా మోదీ పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని ఖర్గే నివాసంలో ప్రతిపక్షాల ఇండియా బ్లాక్ సమావేశం నిర్వహించింది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు, కూటమి భవిష్యత్తు గురించి నేతలు చర్చించారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పనిచేసిన ఇండియా కూటమిలోని భాగస్వాములంతా ఐక్యంగా ఉన్నారని ఖర్గే అన్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఎన్నికల తీర్పు ఉందని తెలిపారు. స్పష్టమైన నైతిక పరాజయం ఉందని అన్నారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్న అన్ని పార్టీలకు ఇండియా కూటమి స్వాగతం పలుకుతోందన్నారు.
ప్రతిపక్షాల ఇండియా బ్లాక్ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ అగ్ర నేతలు హాజరయ్యారు. తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, సీపీఎం నేత సీతారం ఏచూరితో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఇండియా కూటమిలోకి కొత్త పార్టీలను ఖర్గే ఆహ్వానించారు.
ప్రతిపక్షంలోనే కొనసాగాలని ఇండియా కూటమి తీర్మానం చేసుకుంది. బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాటం చేస్తుందని వెల్లడించింది. అంతే కాకుండా ప్రతిపక్షానికి మద్దతుగా నిలిచిన దేశ ప్రజలకు కూటమి తరపున ఖర్గే ధన్యవాదాలు తెలిపారు.