టాలీవుడ్ నటి హేమకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమెను ఆమెను సస్పెండ్ చేస్తూ ‘మా’ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే మా అసోసియేషన్‌లో నటి హేమ సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై మా అసోసియేషన్ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు గురువారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మా అసోసియేషన్ గ్రూప్‌లో సందేశం పంపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సభ్యత్వం శాశ్వత రద్దుపై అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
హేమకు జ్యుడీషియల్ కస్టడీ..
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో గత నెల 20న తెలుగు సినీ నటి హేమ దొరికిపోయిన విషయం తెలిసిందే. మొదటగా ఆమె తప్పుడు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. బెంగళూరు రేవ్ పార్టీలో ఉన్న హేమ.. హైదరాబాద్ ఫాంహౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియో రూపంలో విడుదల చేసి పోలీసులతో పాటు అందరినీ తప్పు దారి పట్టించింది. ఈ విషయం తెలుసుకున్న బెంగళూరు పోలీసులు అమెను అరెస్ట్ చేసింది. తర్వాత సీసీబీ పోలీసులు ఎదుట విచారణ చేశారు. అయితే డ్రగ్స్ కూడా సప్లై చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో హెబ్బగోడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో అనేకల్ నాల్గో అడిషనల్ సివిల్, జేఎంఎఫ్‌సీ కోర్టులో హేమను హాజరుపరిచారు. ఇందులో భాగంగా ఆమెకు జూన్ 14వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.