UPDATES  

NEWS

 ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరాజయం.. జగన్ ఓటమికి కారణాలు ఇవే..!

వై నాట్ 175 అంటూ ప్రచారాన్ని మొదలు పెట్టిన వైఎస్ జగన్ కు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ పడింది. ఎంతలా అంటే అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీడీపీ అవతరిస్తే.. రెండో అతిపెద్ద పార్టీగా జనసేన నిలిచింది. మూడో స్థానంలో వైసీపీ నిలవడం చూస్తుంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి. మరి ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని, ఊహించలేదని చెబుతున్న జగన్ పార్టీకి ఎక్కడ దెబ్బ పడింది?

 

1. అభివృద్ధి ఏది?

 

57 నెలల్లో 124 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. 2.55 లక్షల కోట్ల రూపాయలు లబ్దిదారుల అకౌంట్లలో వేశాను. మీ కుటుంబంలో మంచి జరిగింది, జగనన్నతో మేలు చేకూరింది అనుకునే వాళ్లే ఓటు వేయండి అని ప్రచారాల్లో వైఎస్ జగన్ పదే పదే చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే అది రివర్స్ బటన్ గా మారిపోయింది. కేవలం సంక్షేమమే అంటే జనాలు ఓట్లు వేసే రోజులు పోయాయాన్న విషయాన్ని గ్రహించకపోవడమే జగన్ కు అసలు మైనస్ అయింది. మా డబ్బులు మాకే ఇస్తున్నారు కదా అన్న విషయం జనాలకు బాగా అర్థమైంది. బటన్ ఎవరైనా నొక్కుతారు.. రోడ్లు, డ్రైనేజీలు, తాగు నీరు, పరిశ్రమలు, ఉపాధి కల్పన ఇవన్నీ ఏవన్న ప్రశ్నలు జనంలో వ్యక్తమయ్యాయి. పైగా అవతలి పార్టీ వైసీపీ కంటే ఎక్కువ హామీలు ఇచ్చింది. అభివృద్ధి కూడా చేస్తామన్న నమ్మకం కలిగించింది. కానీ జగన్ పార్టీలో అదే మిస్సయింది. మంచి చేసినా ఓట్లు రాలేవని, ప్రజల ప్రేమ ఆప్యాయత ఎటెళ్లాయో అర్థం కావడం లేదని చెబుతుండడంతో ఇంకా అసలు పాయింట్స్ ను కనిపెట్టలేకపోయారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

 

2. నో యాక్సెస్

 

జగన్ పై టీడీపీ, జనసేన చేసిన విమర్శల్లో ప్రధానమైంది అసలు పబ్లిక్ లోకి సీఎం రావడం లేదని, జనాన్ని కూడా కలిసే తీరిక లేదంటూ విమర్శించారు. అలాగే ఎమ్మెల్యేలకు కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లోకి యాక్సెస్ లేకుండా చేశారన్న విమర్శలు ఉన్నాయి. జనంలోకి రాకపోతే అంతే అని చెప్పడానికి జగన్ ఓటమి ఒక ఉదాహరణ.

 

3. వాలంటీర్ వాషౌట్

 

జగన్ పాలనలో స్ట్రాంగ్ గవర్నెన్స్ లేదన్న వాదనను టీడీపీ, జనసేన వినిపించాయి. 50 ఇండ్లకో వాలంటీర్లను పెట్టడం, వారితోనే పనులు చేయించడం, అటు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ లో లబ్దిదారుల అకౌంట్లలోకే నేరుగా వేయడంతో పార్టీ నేతలకు పెద్దగా పని లేకుండా పోయింది. తమ అవసరాల కోసం ఎమ్మెల్యేల చుట్టూ ఎవరూ తిరగాల్సిన అవసరం రాలేదు. వీటికి తోడు రోడ్లు, డ్రైనేజీలు వంటి చిన్న చిన్న పనులు కూడా లేకపోవడంతో పొలిటికల్ గ్రౌండ్ పూర్తిగా తగ్గిపోయిందంటారు. అటు వాలంటీర్లలో కొందరు అరాచకాలు సృష్టించారన్న విషయాలు కూడా జనంపై బలంగా పని చేశాయి.

 

4. లోకల్ అరాచకాలు

 

వైసీపీ కిందిస్థాయి నాయకత్వం అరాచకాలు పెరిగిపోయాయన్న వాదన నిజమే అన్నట్లుగా జనం తీర్పు ఇచ్చారు. ఇసుక, మట్టి మాఫియా పెరగడం, గనుల తవ్వకాల్లో అక్రమాలు, విచ్చలవిడిగా భూకబ్జాలు ఇవన్నీ పేట్రేగిపోవడంతో జనాల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిందన్న విషయం ఏకపక్ష ఫలితాలు చూస్తే అర్థమవుతుంది. వివిధ సంస్థల సర్వేల్లోనూ ఇవే విషయాలు వెలుగుచూశాయి. అభ్యర్థుల ప్లస్ మైనస్ లు చూస్తే పరిస్థితి ఏంటో తెలిసిపోయింది. ప్రస్తుతం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో ఎన్నడూ లేనంత మంచి చేశామని ఓటమి తర్వాత జగన్ అంటున్నారు. కానీ ఎంత మంచి చేసినా ఇంకోవైపున తమ నాయకత్వాన్ని కంట్రోల్ లో ఉంచుకోకపోవడం కూడా మైనస్ అన్న విషయాన్ని గ్రహించడం లేదా మరి??

 

5. రాజధానికి దారేది?

 

రాజధానిగా అమరావతి వద్దు అని 2019 డే వన్ నుంచి జగన్ డిసైడ్ అయ్యారు. మరి ఆ స్థానంలో ప్రత్యామ్నాయం చూపడంలో మాత్రం గత ఐదేళ్లుగా విఫలమయ్యారు. అది కూడా జనంలో తీవ్రంగా ఇంపాక్ట్ చూపించింది. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందన్న ఆవేదన జనంలో కనిపించింది. ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల జిల్లాల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసిందంటే జనాలు ఎంతగా విసిగిపోయారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు, జనాలు ఓటు ద్వారా తమ జవాబు చెప్పారు. మధ్యలో విశాఖ రాగం ఎత్తుకున్న జగన్… రిషికొండకు గుండు కొట్టించడం తప్ప ఏమీ చేయలేకపోయారని టీడీపీ, జనసేన విమర్శలు చేస్తూ వచ్చాయి. సో క్యాపిటల్ ఇష్యూ పెద్ద ఇంపాక్టే చూపించింది.

 

6. అసలుకే ఎసరు

 

వైసీపీ ఘోర పరాజయం వెనుక మరో కారణం ఏంటో చూద్దాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడకపోవడం మైనస్ గా మారింది.

కేంద్రంతో సఖ్యతగా ఉండడంలో తప్పు లేదు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయడం కూడా చాలా ముఖ్యమే. విభజన హామీలు, ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటివన్నీ కీలకంగా మారాయి. గత ఐదేళ్లలో వీటి జోలికే జగన్ వెళ్లలేకపోయారు. కేంద్రం నుంచి అదనపు నిధులు రాబట్టలేకపోయారు. కేంద్రంతో జగన్ దాగుడుమూతల బంధం ఇప్పుడు ఎన్నికల్లో అసలుకే ఎసరు తెచ్చిందంటున్నారు.

 

7. ముంచిన మార్పు

 

ఎన్నికలకు ముందు జగన్ చేసిన భారీ ప్రయోగం వికటించింది. ఎన్నికలకు ఏడాది రెండేళ్ల ముందు నుంచే అభ్యర్థులపై సర్వేలు చేయించిన జగన్… వ్యతిరేకత పెరిగిన వారిని పోటీ నుంచి తప్పించారు. చాలా మందిని విచిత్రంగా పక్క నియోజకవర్గాలకు పంపించారు. అంతేకాదు.. అనుభవం ఉన్న వారిని కాదని వారి వారసులకు టిక్కెట్లు ఇచ్చారు. చెప్పాలంటే రాజకీయాల్లో ఇదో భారీ ప్రయోగం. ఓవరాల్ గా ఈ పొలిటికల్ ఎక్స్ పరిమెంట్… పెద్ద ఫెయిల్యూర్ మోడల్ గా మిగిలిపోయింది. ఎంతలా అంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతగా. అదీ మ్యాటర్.

 

8. పర్సనల్ ఎటాక్

 

సొంత ప్రచారాలు చేసుకోవడం కరెక్టే. కానీ పక్క పార్టీల నేతల వ్యక్తిగత జీవితాలపై, పర్సనల్ గా ఎటాక్ చేయడం చాలా మైనస్ గా మారిపోయింది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను నేరుగా ఎదుర్కొనలేక.. పదే పదే మూడు పెళ్లిళ్లు అంటూ మాట్లాడారు. పవన్ కు వివాహ వ్యవస్థపై అసలు గౌరవమే లేదంటూ మాట్లాడారు. ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. దాన్ని రాజకీయాల్లోకి ఉద్దేశపూర్వకంగానే లాగేశారు జగన్. ఇలా మాట్లాడడం ద్వారా పవన్ కు వెళ్లే ఓట్లను తనవైపు తిప్పుకోవచ్చనుకున్నారు. కానీ అది టోటల్ గా బూమరాంగ్ అయింది. తాము గౌరవంగా మాట్లాడితే జగన్ మాత్రం పెళ్లాలు పెళ్లాలు అని ఏకవచనంతో మాట్లాడడం ఏంటని పలు బహిరంగ సభల్లో పవన్ ఆవేదన వెళ్లగక్కారు. వాటన్నిటినీ జనం గమనించారు. పోలింగ్ డే నాడు తీర్పు ఇచ్చేశారు.

 

9. ఉద్యోగుల ఆగ్రహం

 

జగన్ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర స్థాయి అసంతృప్తి పెరిగింది. అంగన్వాడీల దగ్గర్నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దాకా అందరూ తమకు అన్యాయం జరుగుతుందని పలు సందర్భాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. పీఆర్సీ విషయమైనా, డీఏ, పాత పెన్షన్ విధానంపైనా తమ అసంతృప్తి వెళ్లగక్కారు. అందుకే పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇది గమనించిన వైసీపీ నేతలు పోస్టల్ ఓట్ల లెక్కింపు విషయంపై సుప్రీం కోర్టు దాకా కేసులు వేశారు. అయినా సరే వాటి అవసరం రాకుండానే జనం తీర్పు ఇచ్చేశారు.

 

10. సోసో మ్యానిఫెస్టో

 

ఈసారి వైసీపీ మ్యానిఫెస్టో జనాన్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. బాబు ఇచ్చిన సూపర్ సిక్స్ ముందు జగన్ హామీలు నిలబడలేదు. జగన్ ఏపీని మరో శ్రీలంక మాదిరి చేసేస్తారని విమర్శించిన టీడీపీ అంతకు మించి హామీలు ఇచ్చింది. అయినా సరే జనం జగన్ కు గుడ్ బై చెప్పేశారు. బాబు హామీలకు ఆకర్షితులయ్యారు. ఇందులో మహిళలకు ఫ్రీ బస్ స్కీం ఇటీవల కర్ణాటక, తెలంగాణలో హిట్ అయింది. తమిళనాడు, ఢిల్లీ వంటి చోట్ల కూడా అమలవుతోంది. దీనికి మహిళలు కనెక్ట్ అయ్యారు. వీటన్నటికంటే ఏపీలో తిరిగి ట్రాక్ లో పడుతుందనుకున్నారు. అందుకే మార్పు కోరుకున్నారు. (స్పాట్)

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |