ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో సీట్లను టీడీపీ గెలుచుకుంది.
టీడీపీ ఒక్కటే 135 స్థానాలను గెలుచుకుంది. వీరిలో రికార్డు స్థాయి మెజార్టీ ఎవరికి వచ్చిందనేది ఏపీలో చర్చ మొదలైంది. తొలుత జగన్, చంద్రబాబు, పవన్‌కల్యాణ్.. ఈ ముగ్గురిలో ఎవరికైనా రావచ్చని భావించారు. చాలామంది బెట్టింగులు కూడా కాశారు. కానీ ఓటర్లు మాత్రం ఊహించన మెజార్టీని కట్టబెట్టారు. ఈ ముగ్గురు ఎవరోకాదు. ఒకరు గుంటూరు, మరో ఇద్దరు విశాఖ నుంచి మాత్రమే రికార్డు స్థాయి మెజార్టీ సాధించారు.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి 91 వేల పైచిలుకు మెజార్టీని సాధించారు. మరొకరు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి తన శిష్యుడు అవంతి శ్రీనివాస్‌పై 92 వేల పైచిలుకు మెజార్టీని సాధించారు. అంతేకాదు భీమిలి నుంచి రెండోసారి పోటీ గెలిచి రికార్డు సృష్టించారాయన. గంటా పొలిటికల్ కెరీర్ చూస్తే ఇప్పటివరకు ప్రతీసారి ఎన్నికలకు తన నియోజకవర్గాన్ని మారుస్తూ వచ్చారు. ఈసారి మాత్రం అలా కాకుండా తొలిసారి గెలిచిన భీమిలి నుంచి ఈసారి బరిలోకి దిగారు. ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో మరోసారి చేయరనే అపవాదును తొలగించారు.
మూడో వ్యక్తి గాజువాక నుంచి టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. ఏపీలో భారీ మెజార్టీ వచ్చిన అభ్యర్థి కూడా. 95 వేల పైచిలుకు మెజార్టీతో మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై విజయం సాధించారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో టీడీపీకి చెందిన ముగ్గురు నేతలు 90 వేల పైచిలుకు మెజార్టీని సాధించారు.