కేంద్రంలో మోదీ మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 8న మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్డీఏ సమావేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు పైన మోదీ చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాలనుంచి ఎవరికి కేంద్ర మంత్రులుగా ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఏపీలో టీడీపీ, జనసేనకు ఛాన్స్ దక్కనుంది. తెలంగాణ నుంచి బీజేపీలో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
మోదీ ఛాయిస్ మోదీ మూడో సారి ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం పై అంచనాలు పెరుగుతున్నాయి. 292 సీట్లు సాధించిన ఎన్డీఏలో టీడీపీ ప్రధాన భాగస్వామిగా ఉంది. 16 మంది ఎంపీలు ఉన్న టీడీపీకి రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. జనసేన నుంచి ఒకరు, బీజేపీ నుంచి మరొకరికి ఛాన్స్ దక్కనుంది. ఏపీకి ఈ సారి కీలక పోర్టు ఫోలియో దక్కనుంది. టీడీపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని పేర్లు ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి ఇద్దరు గెలవటంతో వారిలో ఒకరికి ఛాన్స్ దక్కనుంది.
ఏపీ నుంచి నాలుగు పదవులు ఏపీలో బీజేపీ నుంచి పురందేశ్వరికి కేంద్ర మంత్రిగా ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. ఇక..తెలంగాణ నుంచి బీజేపీ ఎనిమిది స్థానాలు గెలిచింది. ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నుంచి తిరిగి కిషన్ రెడ్డికి అవకాశం ఖాయమైందని సమాచారం. రెండో మంత్రి పదవి కోసం పోటీ నెలకొంది. ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వనుండటంతో..రెండో సీటు బీసీ వర్గానికి ఇస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో..బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. డీకే అరుణ, రఘునందన్, విశ్వేశర రెడ్డి సైతం, డాక్టర్ లక్ష్మణ్ సైతం రేసులో ఉన్నారు.
తెలంగాణ నుంచి ఛాన్స్ ఎవరికి కానీ, 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇస్తుండటంతో పార్టీ బాధ్యతలు మరొకరికి అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అదే విధంగా బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ రెండో మంత్రి పదవి పైన ఆశతో ఉన్నారు. వీరిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి..పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు మరొకరికి అప్పగిస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో..మంత్రివర్గంలో స్థానం, పార్టీ పదవుల పై మోదీ నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.