తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ సత్తా చాటాయి. మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ ఎనిమిది చోట్ల గెలుపొందగా.. బీజేపీ ఎనిమిది చోట్ల జయకేతనం ఎగురవేసింది. ఇక, ఎంఐఎం తన సీటు(హైదరాబాద్)ను దక్కించుకుంది. అయితే, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఖాతా తెరవలేకపోకపోవడం గమనార్హం.
ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, జహీరాబాద్, భువనగిరి, నాగర్ కర్నూల్, పెద్దపల్లిలో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించగా.. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి రికార్డు నెలకొల్పారు. దాదాపు 10 మంది నేతలు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం విశేషం.
నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిపై దాదాపు 5.51 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా, తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే అత్యధిక మెజార్టీ. 2011లో కడప లోక్‌సభ ఉప ఎన్నికలో 5.43 లక్షల మెజార్టీతో వైఎస్ జగన్ గెలవగా, అంతకుమించిన మెజార్టీతో రఘువీర్ విజయం సాధించడం విశేషం.
ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విజయం సాధించారు. ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వర రావుపై 4.67 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక, మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారీ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిపై ఆయన 3.8 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ నేత మాలోత్ కవితపై 3.44 లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించారు. వరంగల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయకేతనం ఎగురవేశారు. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌పై దాదాపు రెండు లక్షలకు పైగా ఓట్ల తేడాతో రికార్డు విజయం నమోదు చేసుకున్నారు.
కరీంనగర్ లోక్‌సభ సీటు నుంచి బీజేపీ నేత బండి సంజయ్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత వేల్చాల రాజేందర్ రావుపై 2.2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి డా.బూర నర్సయ్య గౌడ్‌పై 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయఢంకా మోగించారు.
పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌పై 1.31 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తన సీటును పదిలపరుచుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై లక్ష ఓట్లకు పైగా మెజార్టీ సాధించి రెండోసారి జయకేతనం ఎగురవేశారు.
నాగర్ కర్నూలులో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ పోతుగంటిపై దాదాపు 94 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు దాదాపు 3.2 లక్షల ఓట్లు వచ్చాయి.
ఆదిలాబాద్ లోక్‌సభ సీటు నుంచి బీజేపీ అభ్యర్థి నగేష్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై ఆయన 84 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్షెట్కార్ తన ప్రత్యర్థి, బీజేపీ నేత బీబీ పాటిల్‌పై 47 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.
సికింద్రాబాద్ స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రెండోసారి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌పై దాదాపు 50 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. మెదక్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత నీలం మధుపై 35 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
మహబూబ్‌నగర్‌లో జరిగిన ఉత్కంఠ పోరులో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై స్వల్ప ఆధిక్యంతోనే విజయం సాధించారు. రౌండ్ రౌండ్‌కు ఇక్కడ ఆధిక్యాలు మారడంతో నెలకొన్న ఉత్కంఠ పోరులో చివరకు డీకే అరుణ 3600 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై దాదాపు 1.6 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక, హైదరాబాద్‌లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ 3.25 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఒవైసీకి 6.5 లక్షలకు పైగా ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి మాధవీ లతకు 3.20 లక్షలు, కాంగ్రెస్ అభ్యర్థికి 62 వేలు, బీఆర్ఎస్ అభ్యర్థికి 18 వేల చొప్పున ఓట్లు పోలయ్యాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారానికి దూరమైన బీఆర్ఎస్ పార్టీకి.. తాజాగా, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కస్థానంలో కూడా గెలవకపోవడం ఘోర పరాభవమేనని చెప్పాలి.