ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్లలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటనలో నిందితుడిగా ఉన్న వైసీపీ అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇవాళ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈవీఎం ధ్వంసం ఘటనపై ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. ఆయన కౌంటింగ్ రోజు మాత్రం కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును బాధితులు సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో ఇవాళ తీర్పు వెలువడింది.
ఈవీఎం ధ్వంసం ఘటన తర్వాత హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తో పాటు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు అనుమతి పొందిన మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు, టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిన్నెల్లిని కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు హైకోర్టు ఇచ్చిన అనుమతిని తప్పుబట్టింది.
కౌంటింగ్ సెంటర్ తో పాటు పరిసర ప్రాంతాలకు పిన్నెల్లి వెళ్లకుండా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. జూన్ 6న హైకోర్టులో జరిగే తదుపరి విచారణలో సమగ్ర విచారణ జరపాలని హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇదివరకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రభావానికి లోనుకాకుండా ఈ విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీంతో రేపు జరిగే కౌంటింగ్ ను పర్యవేక్షించేందుకు పిన్నెల్లికి అవకాశం లేకుండా పోయింది.