తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పోటాపోటీగా నిలిచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో త్రిముఖ పోటీ కనిపించింది. అయితే ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ నువ్వా? నేనా? అనే విధంగా పోటీ పడితే.. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉండి.. ప్రస్తుతం ప్రతిపక్ష స్థానంలో ఉన్న భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నామమాత్రంగానే పోటీలో నిలిచింది. మే 13న జరిగిన ఓటింగ్ తర్వాత జూన్ 4వ తేదీన 17 ఎంపీ స్థానాలకు ఫలితాలు వెలువడనున్నాయి. వాటి వివరాల్లోకి వెళితే..
2019 సంవత్సరంలో తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో సుమారుగా 66.4 శాతం ఓటింగ్ నమోదైంది. 17 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 స్థానాలను గెలుచుకోగా, బీజేపీ 4 పార్లమెంట్ స్థానాలు, కాంగ్రెస్ 3 స్థానాలు, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించాయి. ఇక తాజాగా 2024 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 4వ దఫా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 66 శాతం ఓటింగ్ నమోదైంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.