లోక్ సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు తాజాగా జరిగిన ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య తనదైన శైలిలో జోస్యం చెప్పారు. ముఖ్యంగా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు భారీ విజయం ఖాయమని చెప్పేశారు. దీంతోపాటు ఏపీలోనూ కూటమి ఘన విజయం ఖాయమని తేల్చేశారు. దీంతో ప్రశాంత్ కిషోర్ పై కాంగ్రెస్, వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై పీకే స్పందించారు.
తాజా ఎగ్జిట్ పోల్స్ లో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఘనవిజయం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్‌పై రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఎన్నికల సీజన్‌లో నకిలీ జర్నలిస్టులు, గట్టిగా మాట్లాడే రాజకీయ నేతలు, స్వయం ప్రకటిత నిపుణుల పనికిరాని చర్చలు, విశ్లేషణల కోసం తమ సమయాన్ని వృథా చేసుకోవద్దని పీకే ప్రజలను కోరారు. ఇంకోసారి ఎన్నికలు జరిగినప్పుడు ఇప్పటిలా టైమ్ వేస్ట్ చేసుకోవద్దని ఆయన సూచించారు.
ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు. అయితే ఆయన మాటల్ని చాలా మంది పట్టించుకోలేదు. టీవీల్లో జరిగే చర్చలతో పాటు సోషల్ మీడియాలో అనవసర చర్చలు చేశారనే ఆవేదన ఈసారి పీకే మాటల్లో కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ ఘన విజయం ఖాయమని తేలిపోవడంతో పీకే హ్యాపీగా ఉన్నారు. ఇవే ఫలితాలు జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా ఖాయమైతే పీకే మాటలకు మరింత విలువ పెరకబోతోంది.