ఇటీవలే ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనను దేవుడే పంపాడంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆమె ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీపై పలు వ్యాఖ్యలు చేశారు.
దేశ ప్రయోజనాల కోసం భగవంతుడు తనను భూలోకానికి పంపారంటూ ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యాలను ఉద్దేశిస్తూ ఆమె మాట్లాడుతూ.. ‘ఆయన తనకు తాను మరో దేవుడిగా భావిస్తున్నారు. కానీ, దేవుళ్లు రాజకీయాలైతే చేయరు. అల్లర్లు సృష్టించే ప్రయత్నం అసలే చేయరు. నిజంగా.. ఆయన తనకు తాను దేవుడిగా భావిస్తే మోదీకి నేను ఓ విన్నపం చేసుకుంటున్నా. మోదీజీ.. మీకు ఒక దేవాలయాన్ని నేనే నిర్మిస్తా. ప్రసాదంగా మీకు డోక్లా పెడతాను. అదేవిధంగా నిత్యం మీకు పూజలు చేస్తాను. దయచేసి మీరు ఆలయంలో కూర్చోండి.. బయటకు రావొద్దు. దేశాన్ని సమస్యల్లోకి నెట్టే ప్రయత్నాలను మానుకోండి’ అంటూ దీదీ.. ప్రధాని మోదీని ఎద్దేవా చేశారు.
‘ఇప్పటివరకు చాలామంది ప్రధానులతో కలిసి పనిచేశాను. అందులో అటల్ బిహారీ వాజ్ పేయి కూడా ఒకరు. ఆయన అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. కానీ, మోదీ లాంటి ప్రధానిని నేనెప్పుడూ చూడలేదు. ఆయన అవసరం దేశానికి లేదు’ అంటూ మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. బీజేపీ నేత సంబిత్ పాత్ర ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. చాలా చోట్లా పూరీ జగన్నాథుడే మోదీకి పరమభక్తుడు అంటూ పొరపాటును వ్యాఖ్యానించారు. సంబిత్ పాత్ర వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. వెంటనే ఆయన స్పందిస్తూ.. అనుకోకుండా తప్పు జరిగిందంటూ క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే