ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం అంతా ఎదురుచూస్తున్న వేళ పోస్టల్ బ్యాలెట్ల రచ్చ నెలకొంది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటు విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై హైకోర్టును కూడా ఆశ్రయించింది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం వైసీపీకి షాకిచ్చింది. తమ నిర్ణయమే ఫైనల్ అని తేల్చిచెప్పేసింది. దీంతో పోస్టల్ బ్యాలెట్లపై హైకోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారింది.
రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి, సీల్ ,హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని సీఈవో ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ.. సీల్, హోదా ఉండాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ మేరకు నిన్న సీఈవో ముకేష్ కుమార్ మీనాను కలిసిన వైసీపీ బృందం తమ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరింది. సాయంత్రం 4 గంటల వరకూ డెడ్ లైన్ పెట్టడంతో పాటు ఇందులో విఫలమైతే హైకోర్టుకు వెళ్తామని హెచ్చరికలు కూడా చేసింది.
ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరారు. దీంతో సీఈసీ ఇవాళ స్పందించారు. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై స్పష్టతనిచ్చారు. డిక్లరేషన్ పై సీల్, హోదా లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్లను చెల్లుబాటు చేయాలని ఆదేశించింది. దీంతో పోస్టల్ బ్యాలెట్లపై సాగుతున్న రచ్చకు తెరపడింది. అయితే ఇప్పటికే దీనిపై హైకోర్టులో వైసీపీ పిటిషన్ వేయడంతో అక్కడ వెలువడే తీర్పు కీలకంగా మారింది.